'నింగి..నేల..నాదే!' జూలై 3న
యదార్థ కథాంశంతో తెరకెక్కి పలు అవార్డులు, రివార్డులు గెలుచుకున్న చైనీస్ చిత్రం 'ఇన్విజబుల్ వింగ్స్'. లీ చింగ్ యావో ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఫెంగ్ బెంజి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని సుజన మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై 'నింగి...నేల...నాదే!' పేరుతో ఛావా సుధారాణి అనువదించి తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత సుధారాణి తెలిపారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విశేషాలను ఆమె తెలియజేశారు. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం పాల్గొన్నారు.
రెండు చేతులూ లేని ఓ యువత ఈతలో ఎలా ఛాంపియన్ షిప్ సాధించిందనే స్ఫూర్తిదాయక ఇతివృత్తంతో ఈ చిత్రం ఉంటుందని సుధారాణి తెలిపారు. చిన్నాపెద్దా అంతా చూడదగ్గ చిత్రమిదని అన్నారు. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని కథానాయిక మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఈతలో ఛాంపియన్ షిప్ సాధిస్తుందనీ, ఇలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలనీ అన్నారు. కథానాయిక పడిన కష్టాలు చూస్తుంటే తన తండ్రి ఎల్.వి.ప్రసాద్ చిత్ర పరిశ్రమలోకి పైకి వచ్చేందుకు తొలి నుంచీ పడిన కష్టాలు తనకు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని తమ పంపిణీ సంస్థ వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నందుకు గర్విస్తున్నామని అన్నారు. వైఫల్యాలు వచ్చినప్పుడు దిగులు పడకుండా విజయాన్ని ఎలా సాధించాలో ఈ చిత్రం తెలియజేస్తుందనీ, అందరికీ స్ఫూర్తిదాయక చిత్రమిదనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|