నా భర్తతో విడిపోలేదుః ఆర్తి
'నీలవేణి' చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అందాల నటి ఆర్తి అగర్వాల్ లో ఇప్పుడు మునుపటి కంటే ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. తనపై గతంలో వచ్చిన వదంతులతో పాటు తాజా వదంతులకు సైతం ఆర్తి ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ఉజ్వల్ తో తన వైవిహిక సంబంధంలో విభేదాలు వచ్చిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదనీ, హీరో తరుణ్ ను ఆయన పబ్ లో ఇటీవల కలుసుకున్నానంటూ వచ్చిన వార్తలు కూడా నిరాధారమనీ, ఆ మాటకొస్తే తరుణ్ పబ్ ఎక్కడుందో కూడా తనకు తెలియదనీ స్పష్టం చేసింది.
'నా కెరీర్ మొదట్నించీ ఎన్నో పుకార్లు చూశాను. ఒకరోజు ఫుడ్ పాయిజన్ అయితే నేను గర్భవతినంటూ ప్రచారం చేశారు. నా సోదరుడితో కలిసి వెళ్తే కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ పుకార్లు పుట్టించారు. కాలుజారి పడితే ఆత్మహత్యాయత్నం చేసినట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి పుకార్లు అప్పట్లో కొంత మేర బాధించిన మాట నిజమే. ఇక నుంచి వాటిని ఖాతర చేసేది లేదు. ఇప్పుడు వృత్తికి, కుటుంబ సభ్యులకే నేను పరిమితం' అంటూ ఆర్తి చెప్పుకొచ్చింది. తనకు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈరోజు వరకూ తరుణ్ తో తాను టచ్ లో లేననీ, అతని పబ్ ఎక్కడుందో కూడా తనకు తెలియదనీ పేర్కొంది. ఉజ్వల్ తో తన వైవాహిక బంధం చిక్కులో పడినట్టు వస్తున్న వదంతుల్లోనూ నిజం లేదని తేల్చిచెప్పింది. 'నటన అంటే నాకు చాలా ఇష్టం. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో నేనూ, ఉజ్వల్ నెట్ ద్వారా కలిసాం. వెంటనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. నిజం చెప్పాల్సి వస్తే మేమిద్దరం ఇంకా ఒకర్ని ఒకరు పూర్తిగా అర్ధం చేసుకోలేదనే చెప్పాలి. సినిమాలకు స్వస్వి చెప్పాలని ఉజ్వల్ కోరుతున్నాడు. అందుకు నేను సిద్ధంగా లేను. దాంతో ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టి పెట్టాలని ఎవరికి వారు నిశ్చయించుకున్నాం. ఇద్దరం ఒకరి అభిమతాన్ని మరొకరు అర్థం చేసుకోవడానికి మరి కొంత కాలం పట్టొచ్చు. అప్పుడు కలిసే ఉంటాం. అలా కాని పక్షంలో దూరంగా ఉంటాం. ప్రస్తుతానికైతే మేమిద్దరం మంచి మిత్రులం' అంటూ ఆర్తి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం 'నీలవేణి'చిత్రంతో పాటు పోసాని కృష్ణమురళితో మరో చిత్రంలో ఆర్తి నటిస్తోంది. ఒక చిత్రంలో ఆర్తికి తండ్రి పాత్రలో శశాంక్ అగర్వాల్ (ఆర్తి తండ్రి) నటిస్తుండటం విశేషం.
Be first to comment on this News / Article!
|