'మల్లన్న' జూలైలో లేనట్టే?!
'అపరిచితుడు' చిత్రం తర్వాత హీరో విక్రమ్ ను మళ్లీ ఆ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్న చిత్రంగా 'మల్లన్న' కొద్దికాలంగా విపరీతమైన పబ్లిసిటీని చూరగొంటోంది. సుశీ గణేషన్ దర్శకత్వంలో కళైపులి థాను సుమారు 45 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం, విక్రమ్ కు జోడిగా గ్లామర్ నటి శ్రియ నటిస్తుండటంతో పాటు పలు హైలైట్స్ ఈ చిత్రంలో చోటుచేసుకుంటున్నాయి. తమిళంలో ఈ చిత్రం 'కందసామి' పేరుతో విడుదల కానుంది. దాదాపు రెండేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చియాన్ విక్రమ్ అభిమానులు ఎదురుతెన్నులు చూస్తున్నారు. అయితే మరో నెలరోజుల పాటు ఈ నిరీక్షణ తప్పదనీ, జూలైలో 'మల్లన్న' వెలుగుచూసే అవకాశాలు దాదాపు లేనట్టేననీ చెన్నై వర్గాల ద్వారా తెలుస్తోంది. హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించే విధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇందులో ఉండబోతున్నాయనీ, వీటి కోసం మరికొంత వ్యవధి అనివార్యం కానుందనీ, ఏరకంగా చూసినా ఆగస్టులోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయనీ ఆ వర్గాలు చెబుతున్నారు.
సమాజంలో అంతకంతకూ విశ్వరూపం దాలుస్తున్న ఆర్థిక అసమానతలపై పోరాటం సాగించిన ఓ ప్రభుత్వాధికారి కథే 'మల్లన్న'. సిబిఐలో ఆర్థిక నేరాల విభాగాన్ని పర్యవేక్షించే అధికారిగా విక్రమ్ ఇందులో కనపించనున్నారు. రాబిన్ హుడ్ తరహాలో ఆయన పాత్ర ఉండబోతోంది. విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన అభ్యుదయ భావాలు కలిగిన అమ్మాయిగా శ్రియ నటించింది. నటశేఖర కృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు. గీత రచయిత సాహితి ఈ చిత్రం ద్వారా మాటల రచయితిగా పరిచయం కావడం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణలు కాబోతున్నాయి. విక్రమ్ ఐదు గెటప్స్ లో కనిపించ నుండగా, ఇందులోని పాటలన్నింటినికీ ఆయన స్వయంగా నేపథ్యగానం అందించారు. తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న 'మల్లన్న' చిత్రాన్ని వివిధ భాషల్లో 900కు పైగా థియేటర్లరో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాత కళైపులి థాను ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|