'భీష్మ' తెరవెనుక స్టోరీ?
'మిత్రుడు' చిత్రం తర్వాత యువరత్న బాలకృష్ణ కథానాయకుడు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ 'భీష్మ' సినిమా అనౌన్స్ చేయడంతో బాలయ్య బాబు అభిమానుల్లో ఉత్సాహం తొంగిచూస్తోంది. బెల్లంకొండకు నిర్మాతగా స్టార్ ఇమేజ్ బాలకృష్ణ సినిమాలతోనే వచ్చిందనేది కాదనలేని సత్యం. ఈ ఇద్దర్నీ మంచి మిత్రులుగా కూడా చెబుతుంటారు. 'లక్ష్మీనరసింహా' చిత్రం విషయంలో ఈ ఇద్దరికీ పొరపొచ్చాలు వచ్చాయనీ, పర్వవసానంగానే బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన చోటుచేసుకుందనీ అప్పట్లో అంతా అనుకున్నదే. బాలకృష్ణను ఈ సంఘటన ఇరకాటంలో పెట్టే అవకాశాలున్న తరుణంలో ఇద్దరి మధ్యా కుదిరిన 'రాజీ'తో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇందులో భాగంగానే బెల్లంకొండతో పనిచేసేందుకు బాలయ్య భరోసా ఇచ్చారనే కథనాలు కూడా అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు ఆ తరుణం వచ్చింది. బెల్లంకొండ 'రైడ్' చిత్రం ఆడియో వేడుకకు బాలయ్య విచ్చేయడం, బాలయ్య పుట్టినరోజును తన చిత్ర యూనిట్ తో సహా బెల్లంకొండ జరుపుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. బాలయ్య బాబు డేట్స్ ఇస్తే వెంటనే సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సురేష్ ప్రకటించారు. ఇది జరిగిన వారం రోజులకే బాలకృష్ణతో 'భీష్మ' చిత్రాన్ని అనౌన్స్ చేయడం, పూజా కార్యక్రమాలు కూడా జరపడం చకచగా జరిగిపోయాయి. రమేష్ వర్మ ('రైడ్' ఫేమ్) దర్శకత్వంలో ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఆసక్తికరంగా ఇప్పుడో రసవత్తరమైన చర్చ ఫిల్మ్ సర్కిల్ లో జరుగుతోంది. బెల్లంకొండ వద్ద బాలకృష్ణకు చెందిన మూడు సినిమాల డేట్స్ ఉన్నాయన్నదే ఈ చర్చ సారాంశం.
అందర్నీ కలవరపెట్టిన ఆనాటి ఉదంతం అనంతరం బెల్లంకొండతో మూడు సినిమాలకు బాలయ్య డేట్స్ కమిట్ అయ్యారట. అయితే ఇక్కడ ఓ మెలిక ఉందట. ఆ మూడింటినీ బెల్లంకొండ స్వయంగా నిర్మించనూ వచ్చు. ఆ డేట్స్ ను వేరేవారికి (తనవాళ్లకు) బదలాయించనూ వచ్చట. అయితే మాటకు కట్టుబడటానికే బాలయ్య ఇప్పటికీ మొగ్గుచూపుతున్నారట. 'భీష్మ' ఇప్పటికే బెల్లంకొండ అనౌన్స్ చేసినందున మిగిలిన రెండు చిత్రాల విషయం తేలవలసి ఉంటుందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ఏదిఏమైనా...ఇలాంటి 'ఒప్పందాలు' ఏవైనా ఉంటే పరస్పర అవగాహనతోనే కుదురుతాయి కాబట్టి వేచిచూడటం మినహా నిజానిజాలు బయటకు వచ్చే అవకాశాలు అంతగా ఉండవు మరి...
Be first to comment on this News / Article!
|