ఛానల్స్ మోజులో స్టార్స్!
మీడియాకూ, సినీరంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. మంచి సినిమాకి అంతకు మించిన పబ్లిసిటీ కూడా అవసరం. ఇందుకు మీడియా ఉపకరిస్తుంటుంది. సినీ గ్లామర్ ప్రపంచానికి వన్నెతరగని ఆదరణ ఉండటం వల్ల మీడియాకు సైతం ఎంటర్ టైన్ మెంట్ కు పెద్దపీట వేయాల్సి వస్తుంటుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు టీవీ ఛానెల్స్ లోకి అడుగుపెట్టారు. తాజాగా మరికొందరు కూడా సొంత ఛానెల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. వీరిలో ప్రముఖ నటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు, సీనియర్ నటుడు మురళీమోహన్ ఉన్నారని సమాచారం.
సినీరంగంలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకుని, తన కుమారులిద్దర్నీ హీరోలుగా స్థిరపరచిన క్రెడిట్ మోహన్ బాబుకు దక్కుతుంది. కుమార్తె లక్ష్మీప్రసన్న ఇప్పటికే నిర్మాతగా తన సత్తా చాటుకున్నారు. బుల్లితెరకు కూడా లక్ష్మీప్రసన్న సంస్థ ఇటీవల పరిచయమైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు త్వరలోనే ఓ సొంత ఛానెల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని బలంగా వినిపిస్తోంది. ఇందుకు లక్ష్మీప్రసన్న, ఆమె భర్త కూడా ఆసక్తిని కనబరుస్తున్నారని సమాచారం. మోహన్ బాబు న్యూస్ ఛానెల్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారనీ, లక్ష్మీప్రసన్న ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ను వైపు మక్కువ చూపుతున్నారనీ సమాచారం. ఛానెల్ ఏర్పాటు విషయంలో దాసరి సైతం మోహన్ బాబును ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. నవంబర్ లో కొత్త ఛానెల్ ప్రసారాలు మొదలుకావచ్చట. మోహన్ బాబు సమకాలికుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా రాణించి నిర్మాతగా కూడా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సీనియర్ నటుడు మురళీమోహన్ సైతం కొద్దికాలంగా మీడియా రంగంలోకి అడుగుపెడతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మురళీ మోహన్ ఎప్పటికప్పుడు ఈ వార్తలను తోసిపుచ్చుతూనే ఉన్నారు. అలాంటి ఆలోచన లేదని చెబుతున్నారు. ఈసారి మాత్రం మురళీమోహన్ ఓ ఛానెల్ ఏర్పాటుకు స్థిరనిశ్చయంతో ఉన్నారని టాలీవుడ్ వర్గాల కథనం. గత ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజితుడైన మురళీమోహన్ సొంత ఛానెల్ ఏర్పాటుకు అవసరమైన విధివిధానాలపై ప్రస్తుతం దృష్టి సారించారని తెలుస్తోంది. ఇది రియల్ ఎస్టేట్ ఛానెల్ కావచ్చని కొందరు అంటుండగా, న్యూస్ తో కూడిన ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ కావచ్చని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు జివికె గ్రూప్ సంస్థ ఈ ఏడాది చివర్లో ఓ ఫ్యాషన్ ఛానెల్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల అనంతరం కొన్ని ఛానెల్స్ మనుగడ కోసం ఎదురీదుతున్నట్టు ప్రచారం జరుగుతున్న తరుణంలో మరికొన్ని కొత్త ఛానెల్స్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటం విశేషం.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|