నయనతారపై నిఘా?
శింభుతో హాట్ హాట్ ప్రేమాయణానికి తెరపడినప్పటికీ డాన్సింగ్ సంచనలం ప్రభుదేవాతో రొమాన్స్, ఇద్దరికీ పెళ్లయిందనే రూమర్స్ నయనతార చుట్టూ బిగుసుకుంటున్నాయి. దీంతో కలత చెందిన ఆమె తల్లిదండ్రులు నయనతారను క్షణం కూడా విడిచిపెట్టకుండా వెన్నంటే ఉంటున్నారట. ప్రభుదేవా-నయనతారల ప్రేమ వ్యవహారం ఇటీవల కథలు కథలుగా ప్రచారంలోకి రావడం పరిశ్రమ వర్గాల్లోనూ, నయన అభిమానుల్లోనూ కలకలం రేపింది. 'విల్లు' సెట్స్ లో నయనతార-ప్రభుదేవాల మధ్య ప్రేమ చిగురించింది. ప్రభుదేవా పదేళ్ల కొడుకు ఇటీవల కాన్సర్ తో మరణించడం, శింభుతో నయనతార ప్రేమాయణం బెడిసికొట్టడంతో ఇద్దరూ ఒకరికొకరు స్వాంతన చెప్పుకోవడం ద్వారా దగ్గరయ్యారట. నయనతార మరో అడుగు ముందుకు వేసి తన ఎడమచేతిపై ప్రభుదేవా పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది. కొద్దిరోజుల క్రితమే ఈ ఇద్దరూ తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ పుకార్లు వెల్లువెత్తాయి. గత వారంలోనే ఈ ఇద్దరూ దుబాయ్ లో కలుసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుదేవా తనకు మంచి మిత్రుడు మాత్రమేననీ, రహస్యంగా పెళ్లి చేసుకునే అవససరం తనకు లేదనీ నయనతార నమ్మబలుకుతున్నా ఆమెపై వస్తున్న వదంతులు మాత్రం ఆమె తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఇక నుంచి నయనతార ఎక్కడకు వెళ్లినా తాము కూడా వెన్నంటే వస్తామనీ, అందుకు ఇష్టం లేకుండా నటనకు స్వస్తి చెప్పినా తమకు అభ్యంతరం లేదనీ వారు తేల్చిచెప్పారట. తల్లిదండ్రుల నిఘా కొంత ఇబ్బందికరమే అయినప్పటికీ నయనతారకు ఇక నుంచి అలాంటి పరిస్థితి తప్పేట్టు లేదు. పనిలో పనిగా నయనతార మంచి చెడ్డలతో పాటు ఆమె తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవడం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లకూ తప్పదు.
Be first to comment on this News / Article!
|