భగ్న ప్రేమికులు ఓదార్పు కోరుకుంటారట. అలాంటి ఓదార్పు ఎవరిదగ్గరైనా లభిస్తే వారిని తమ జీవితంలోకి ఆహ్వానించడానికి కూడా వెనుకాడరు. తమిళనాట చిచ్చరపిడుగు అనిపించుకున్న హీరో శింభు ప్రేమాయణం ఈ కోవలేనిదే. నటి నయనతారతో శింబు ప్రేమాయణం అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రేమలో అపశ్రుతులు దొర్లడంతో శింబుకు నయనతార దూరమైంది. తిరిగి ఆమెను ఆకట్టుకునేందుకు శింబు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి బెడిసికొడుతూనే వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ కెరీర్ పైనే దృష్టిసారిస్తున్నప్పటికీ కొత్త ప్రేమాయణాల వైపు మొగ్గచూపుతున్నారనే వదంతులకూ కొదవలేదు. ప్రముఖ కొరియాగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవాకు దగ్గరైన నయనతార ఏకంగా అతన్ని రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలు ఇటీవల కలకలం సృష్టించాయి. మరోవైపు శింబు సైతం 'విన్నైతాండి వరువాయ' అనే తమిళ చిత్రం షూటింగ్ లో తనకు జోడిగా నటిస్తున్న త్రిషతో ప్రేమలో పడ్డాడంటూ వదంతులూ మొదలయ్యాయి. అయితే ఇవన్నీ నిరాధారమైన వార్తలేనంటూ శింబు తాజాగా ఖండించారు.
'స్కూల్ డేస్ నుంచే త్రిష నాకు మంచి ఫ్రెండ్. అప్పట్లో ఇద్దరూ కలిసి అలై అనే సినిమాలో నటించాం. ప్రస్తుతం మరో చిత్రంలో కలిసి నటిస్తున్నాం. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు అత్యుత్సాహంతో లేనిపోని వదంతులు పుట్టించి తమ విలువైన సమయాన్ని కూడా వృథా చేసుకుంటున్నారు. ఇలాంటి వదంతుల్లో ఎంత మాత్రం నిజంలేదు. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. ఇంకా ఎవరూ నా జీవితంలోకి రాలేదు. కెరీర్ పైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నాను' అని శింభు తేల్చిచెప్పారు.