'కలవరమాయె మదిలో' 17న
'అష్టాచమ్మ' చిత్రంలో మహేష్ అభిమానిగా కావాల్సినంత వినోదం పంచిన స్వాతి ఇప్పుడు గాయని కావాలని కోరుకునే అమ్మాయి పాత్రలో 'కలవరమాయె మదిలో' అంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంది. స్వాతికి జంటగా కమల్ కామరాజ్ ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) నటించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ వడ్లపట్ల నిర్మించిన ఈ చిత్రానికి కె.సతీష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
సుప్రసిద్ధ గాయని కావాలనుకునే ఓ అమ్మాయి తన కలను ఎలా సాకారం చేసుకుందన్నదే ఈ చిత్ర కథ అనీ, ఆ పాత్రను స్వాతి సమర్ధవంతంగా పోషించిందనీ దర్శకుడు సతీష్ తెలిపారు. ఈ చిత్రానికి దిల్ రాజు టైటిల్ సూచించడమే గాకుండా, ఆయన రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ను తమకిచ్చారనీ, ఇటీవల విడుదల చేసిన ఆడియో కూడా మంచి సక్సెస్ సాధించిందనీ చెప్పారు. కమల్ కామరాజుతో పాటు హీరోయిన్ తండ్రిగా హిందీ 'హమ్ దిల్ దే చుకే హై సనమ్' చిత్రంలో నటించిన ప్రముఖ రంగస్థల నటుడు విక్రమ్ గోఖలే, తనికెళ్ల భరణి పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సింగిల్ కార్డ్ పై వనమాలి రాసిన పాటలు, శరత్ వాసుదేవన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయని అన్నారు. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లోనే 'ది బెస్ట్ ' చిత్రంగా పలు అవార్డులు, రివార్డులు కూడా ఈ చిత్రానికి లభిస్తాయనే గట్టి నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. లవ్, ఫ్యామిలీ డ్రామాతో కూడిన మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటందని వడ్లపట్ల మోహన్ తెలిపారు. దర్శకుడు సతీష్ ఈ చిత్రాన్ని ఎంతో కమిట్ మెంట్ తో తెరకెక్కించారనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|