'మగధీర' రాక 29న
రామ్ చరణ్ 'మగధీర' ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినీగోయెర్స్ కు మరో పక్షం రోజుల నిరీక్షణ తప్పదు. ఈనెల 22న గానీ 24న గానీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇంతవరకూ ప్రచారం జరిగినా అధికారికంగా మాత్రం దర్శకనిర్మాతలు విడుదల తేదీని ప్రకటించలేదు. ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. ఈనెల 29న 'మగధీర' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ ధ్రువీకరించారు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా సుమారు 40 కోట్ల భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కమర్షియల్ చిత్రాలకు కొత్త అర్ధం చెప్పడం ద్వారా వరుస సక్సెస్ లకు కేరాప్ అడ్రెస్ గా నిలుస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ కు జోడిగా కాజల్ తొలిసారి నటించింది.
పునర్జన్మల కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోంది. 400 ఏళ్ల క్రితం నుంచి ప్రస్తుత కాలం వరకూ కథాక్రమం సాగుతుంది. రామ్ చరణ్, కాజల్, శ్రీహరి ఇందులో తలో రెండు పాత్రలు (ద్విపాత్రాభినయం) చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ దర్శకత్వంలో రూపొందిన భారీ సెట్టింగ్ లు అలనాటి రాచరికపు వాతావరణాన్ని తలపించేలా ఉండబోతున్నాయి. గ్రీకువీరుడు తరహాలో రామ్ చరణ్ గెటప్ ఇప్పటికే పబ్లిసిటీ పోస్టర్ల రూపంలో అందర్నీ ఆకర్షిస్తుండగా, ఆడియో సైతం రికార్డు సేల్స్ అమ్మకాలు జరుపుకొంటోంది. చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' లోని 'బంగారు కోడిపెట్ట' సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేసి రామ్ చరణ్-చిరంజీవిపై చిత్రీకరించడం, సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎం.కీరవాణి రీరికార్డింగ్, రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనింగ్, పీటర్ హెయిన్స్ థ్లిల్స్ ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలువనున్నాయి. అలాగే చిరంజీవి 'వేట', ఎన్టీఆర్ 'యమదొంగ' మిక్స్ చేస్తే 'మగధీర' అవుతుందనే ప్రచారమూ జరుగుతోంది. తెలుగు సినిమా స్టామినాను చాటిచెప్పేలా 'మగధీర' ఉంటుందని రాజమౌళి ఢంకా బజాయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|