రాశి మళ్లీ తీస్తుందట...
పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడి ఒకటి ఉంది. ఇప్పుడు నటి-నిర్మాత రాశి అదే ప్రయత్నంలో ఉంది. తన భర్త నివాస్ దర్శకత్వంలో సొంతంగా మరో చిత్రాన్ని నిర్మించేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా. బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా రాణించిన రాశి ఆ తర్వాత క్రమంగా ఒళ్లు చేయడంతో అవకాశాలు తగ్గుముఖం పట్టి అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నివాస్ ను ప్రేమ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంది. ఆ తర్వాత 'వెంకీ'లో ఓ ఐటెం సాంగ్, తేజ 'నిజం'లో వ్యాంప్ రోల్ చేసి దాదాపు నటనకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేసింది. తన భర్త నివాస్ కెరీర్ పై దృష్టిపెట్టి ఆయనను దర్శకుడిగా చేస్తూ సుమారు ఏడాదిన్నర క్రితం సొంతంగానే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. నిర్మాత డిఎస్ రావుతో కలిసి 'మహారాజశ్రీ' అనే చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించింది. రిషి, నిఖిత జంటగా నటించిన ఆ చిత్రం బాక్సాఫీస్ ఫలితం నిరాశపరచడంతో నివాస్ కు మళ్లీ అవకాశాలు లేవు.
దర్శకుడిగా నివాస్ ప్రతిభపై నమ్మకం ఉన్న రాశి ఎలాగైనా మరో సినిమాతో ఆయనకు సరైన బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. తాజాగా నివాస్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రాన్ని నిర్మించేందుకు రాశి సన్నాహాలు చేస్తోందట. ఈసారి నివాస్ సక్సెస్ అయితే తమిళంలో అవకాశాలు రావడంతో పాటు తెలుగులో కూడా మంచి డిమాండ్ వస్తుందని రాశి ఆలోచనగా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వస్తుంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|