జోష్ లో 'అన్నయ్య' ఎవరు?
నాగార్జున తనయుడు నాగచైతన్యను కథానాయకుడిగా పరిచయమవుతూ రూపొందుతున్న చిత్రం 'జోష్'. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో దిల్ రాజు చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన వాసువర్మ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయవుతున్నారు. అలనాటి అందాల నటి రాధ కుమార్తె కార్తిక ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఓ పాట చిత్రీకరణ జరుపుకొంటోంది. ఆసక్తి కరంగా ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై 'అన్నయ్య వచ్చినాడే' పాట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటను దిల్ రాజు స్వయంగా పాడటం విశేషం. అయితే ఈ పాటలో 'అన్నయ్య ' ఎవరై ఉంటారనే రసవత్తరమైన చర్చ కూడా జరుగుతోంది.
రామ్ చరణ్ 'మగధీర'లో చిరంజీవి ఓ పాటకు స్టెప్ వేసినట్టే, ఇప్పుడు 'జోష్'లోని 'అన్నయ్య...' పాటలో నాగార్జున కనపించబోతున్నాడని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అలాంటిదేమీ లేదనీ, 'అన్నయ్య' బాలకృష్ణేననీ, గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారని మరికొందరి మాట. ఈ విషయంపై దిల్ రాజు ఇంకా పెదవి విప్పలేదు. ప్రస్తుతం ఆయన ఆగస్టు రిలీజ్ టార్గెట్ గా సినిమా పూర్తి చేయడానికి తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 25 నుంచి 'ఎవ్వరికి తెలియనిది ప్రేమది ఏ రూపం' అనే పాటను స్విట్జర్లాండ్ లో చిత్రీకరిస్తున్నారు. అనంతరం హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'బ్యాడ్ బ్యాడ్ బోయ్' అనే చివరి సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|