గణేష్ కు డబ్బులెక్కడివి?!
రాత్రికి రాత్రి టాప్ ప్రొడ్యూసర్ అయిపోయి అగ్రహీరోలతో వరుస ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేస్తే ఎవరికైనా కన్ను చెదురనూ వచ్చు. ఆ తర్వాత కూపీలు లాగి పలు కథనాలు ప్రచారం చేయనూ వచ్చు. చిన్నా చితకా వేషాలు లెక్కకు మించే చేసిన హాస్య నటుడు గణేష్ ఈమధ్యనే గణేష్ బాబు పేరుతో నిర్మాతగా మారి పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై రవితేజ హీరోగా 'ఆంజనేయులు' చిత్రాన్ని తక్కువ పనిదినాల్లో (కేవలం 45 రోజులు) చకచగా తీసి రిలీజ్ కు రెడీ చేయడం ద్వారా ఆందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారు. నిజానికి ఈ సినిమా కంటే ముందే తన బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెంబర్ వన్ గా పవన్ కల్యాణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసి ఆయన సంచలనం సృష్టించారు. కారణాంతరాల వల్ల పవన్ సినిమా వెనక్కి వెళ్లి 'ఆంజనేయులు' ఆయన తొలి చిత్రంగా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం ఆడియో విడుదలకు హాజరైన దర్శకరత్న దాసరి ఓ చిన్న స్కూప్ ఇస్తూ 'గణేష్ లో మంచి నటుడి కంటే మంచి బిజినెస్ మన్ ఉన్నట్టు అతన్ని చూసినప్పుడే నాకు అనిపించింది. అందుకు తగ్గటే తొలి సినిమాకి ఆయన మంచి టేబుల్ ప్రాఫిట్ కూడా రాబట్టారు' అని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
'కిక్' చిత్రం సక్సెస్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ఆంజనేయులు'కు మంచి బిజినెస్ జరిగి ఉండొచ్చు. అయితే టేబుల్ ప్రాఫిట్ విషయం దాసరి ముఖత: రావడంతో ఎంత లాభం వచ్చి ఉండొచ్చనే ఆరాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి రూ.5 కోట్ల వరకూ టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని కొందరు తేల్చిచెబుతున్నారు. రవితేజ తన రెమ్యునరేషన్ 4.5 కోట్ల వరకూ తీసుకున్నారని మరో సమాచారం. ఈ లెక్కల మాటెలా ఉన్నా పవన్, రవితేజ వంటి స్టార్ హీరోలతో గణేష్ వంటి చిన్న ఆర్టిస్టు సినిమాలు తీయడానికి అంత డబ్బులెలా వచ్చి ఉంటాయనే చర్చ ముదురుతోంది. గణేష్ ఈ మధ్య రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బులు సంపాదించి సినిమాలు తీస్తున్నట్టు ఆయన సహ కమెడియన్ ఆలీ ఆడియో విడుదల వేడుకలో చెప్పుకొచ్చారు. అయితే దీనిపై మరికొందరు ఇంకొంచెం కూపీ లాగి మరో కొత్త విషయం బయట పడేశారు. ఇదే ఆడియో వేదికకు హాజరైన సీనియర్ రాజకీయ నాయకుడు ఒకరు గణేష్ కు అత్యంత సన్నిహితుడనీ, గణేష్ ను ముందుంచి ఆయనే తన పెట్టుబడితో నిర్మాణం సాగించారనీ, ఆయన కార్డ్ చూపించే స్టార్ హీరోలను గణేష్ ఒప్పించగలిగారనీ వారి కథనం. నిజానిజాలమాట ఎలా ఉన్నా కమెడియన్ల నుంచి నిర్మాతగా మారిన గణేష్ చొరవ, సాహసాన్ని సాటి కమెడియన్ ఫ్యామిలీ మాత్రం గర్వంగా చెప్పుకుంటోంది.
Be first to comment on this News / Article!
|