పవన్-పూరీ సినిమా లేనట్టే!
స్టార్ హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ అనగానే తొమ్మిదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బద్రి' చిత్రం గుర్తొస్తుంది. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ లో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఆ కాంబినేషన్ తో ఓ చిత్రాన్ని నటుడు-నిర్మాత గణేష్ కొద్దకాలం క్రితం ప్రకటించారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై 'ప్రొడక్షన్ నెంబర్ 1'గా ఈ చిత్రాన్ని ప్రకటించారు. పవన్ నటిస్తున్న 'కొమురం పులి' పూర్తికాగానే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలని ఆయన ప్లాన్ చేశారు. పలు కారణాల వల్ల 'కొమురం పులి' ప్రోగ్రస్ కు అంతరాయ కలగడంతో గణేష్ 'ప్రొడక్షన్ నెంబర్ 2' గా రవితేజతో 'ఆంజనేయులు' చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేశారు. అనూహ్యంగా ఇప్పుడు గణేష్ తన బ్యానర్ నుంచి మూడో చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా ప్రకటించారు. కాకుంటే దర్శకుడిగా హరీష్ శంకర్ ('షాక్') ను ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. మరి పూరీ సినిమా మాటేమిటనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
గణేష్ బ్యానర్ లో 'ప్రొడక్షన్స్ నెంబర్ 1' అనుకున్న సినిమా ఇదే కావచ్చనీ, పూరీ స్థానంలో హరీష్ వచ్చి ఉండవచ్చనీ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ప్రొడక్షన్ నెంబర్ 3 గా తన కొత్త చిత్రాన్నిగణేష్ ప్రకటించడం వల్ల పవన్-పూరీ చిత్రం ఇప్పటికీ ఆయన ప్రాధాన్యతా క్రమంలో ఉందని మరికొందరు అంటున్నారు. అదే జరిగితే గణేష్ రెండు చిత్రాలకు పవన్ కమిట్ అయినట్టు లెక్క. ప్రస్తుతం పవన్ చూపంతా 'కొమురం పులి' ముగించి మళ్లీ 'జల్సా' డెరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పనిచేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్-పూరీ కాంబినేషన్ కు అవకాశాలు తక్కువేనని చెప్పొచ్చు. ఆసక్తికరంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నల్లమలుపు బుజ్జి ఓ చిత్రం తీసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పుడు హరీష్ కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి జంప్ అయినట్టే.
Be first to comment on this News / Article!
|