ఉత్తమ చిత్రం...ఉత్తమ హీరో వంటి క్యాటగిరీలకు అవార్డులు ఇచ్చినట్టే తర్వలో అఘోరా అవార్డు కూడా నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువరు అంటున్నారు. తెలుగు సినిమాల్లో అఘోరా కాన్సెప్ట్ పై ఫిల్మ్ మేకర్స్ కు పెరుగుతున్న మోజే ఇందుకు కారణం. ఆసక్తికరంగా దాదాపు ఏడాది గ్యాప్ లోనే మూడు సినిమాలు అఘోరా థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆమధ్య 'నేనే దేవుడు' అనే చిత్రం తమిళం నుంచి అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు బాగానే నచ్చింది కూడా. అఘోరా కాన్సెప్ట్ తోనే ఈమధ్యనే వచ్చిన 'అరుంధతి' సంచలన విజయం సాధించింది. ఏ నోట విన్నా 'బొమ్మాలీ..నిన్ను వదలా' అనే మాటే ఊతపదంగా మారింది. అఘోరా పాత్ర పోషించిన సోనూ సూద్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అదే పాత్రను హిందీ 'అరుంధతి' వెర్షన్ లోనూ ఆయన పోషించబోతున్నారు. ముచ్చటగా మూడోసారి మళ్లీ 'మగధీర' లో అఘోరా కాన్సెప్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాత్రను రావుగోపాలరావు తనయుడు రావు రమేష్ పోషించారు. నిజానికి ఆయనను గుర్తుపట్టడం కూడా కష్టమన్నట్టుగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కాకుంటే కాస్తంత ఓవర్ మేకప్ అనిపించినా ఆడియెన్స్ సద్దుకుంటూ ఈ నటుడెవరా అని ఆరాలు కూడా తీస్తున్నారు.
ఒక కాన్సెప్ట్ హిట్ అయితే అదే కాన్సెప్ట్ విసుగు పుట్టించు వరకూ జనాల మీదకు వదలడం ఫిల్మ్ మేకర్స్ కు పరిపాటి. ఈ దృష్ట్యా మునుముందు మరింతమంది అఘోరాలు తెలుగుతెరపై దండెత్తే అవకాశాలూ పుష్కలం. జనం మెచ్చిన వాళ్లకు అవార్డులు ఖాయమే కాబట్టి ముందస్తుగా బెస్ట్ అఘోరా అవార్డు ఒకటి ఎవరైనా ఏర్పాటు చేసినా చేయొచ్చు.