తార బ్రాస్లెట్ లో రుద్రాక్ష
కొందరు తారలు ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నానుతూనే ఉంటారు. వాస్తవం కొంత...అతిశయోక్తులు మరికొంత కలిసి సంచలనం సృష్టించే వార్తలు కొండొకచో తారలకు మనస్థాపం కలిగిస్తుంటాయి. శింబుతో ప్రేమాయణానికి తెరపడేంతవరూ వార్తల్లో ప్రముఖంగా క(వి)నిపించిన నయనతార ఈమధ్యకాలంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా పేరు చేతిపై టట్టూగా వేసుకోవడం, ఫారెన్ లొకేషన్లలో ప్రభుదేవాతో ప్రైవేటుగా తిరుగతూ కెమెరాలకు చిక్కడం సంచలనమై కూర్చుంది. ఈ ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. షరామామూలుగా ఆ వార్తలను వారిరువురూ ఖండించినా...నయనతారను ప్రభుదేవా బాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారంటూ ఏవో కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నయనతార మరోసారి మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. నయనతార క్రిస్టియన్ అయినప్పటికీ మతంతో ప్రసక్తి లేకుండా ప్రార్థనా స్థలాలు ఎక్కడ కనిపించినా వాటిని దర్శించుకుని పూజలు జరపడం, తులాభారం ఇవ్వడం ద్వారా తన భక్తిప్రపత్తులను చాటుకుంటూ ఉండటం అందరికీ తెలిసిందే. తాజాగా నయనతార మరో అడుగు ముందుకు వేసి రుద్రాక్ష పొదిగిన బ్రాస్ లెట్ ను తన చేతికి ధరించి అందర్నీ ఆకట్టుకుంటోది.
రుద్రాక్ష ధరించడం వెనుక ఆధ్యాత్మిక మర్మాలు చాలానే ఉన్నాయి. దిష్టి తగలకుండా రుద్రాక్షను ధరించడమనేది ఇందులో ఒకటి. అనవసర వివాదాలు తనను చుట్టుముడుతుండటంతో ఆమె రుద్రాక్షను ధరించి ఉండొచ్చని అంటున్నారు. రుద్రాక్షల సెంటిమెంట్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ కూ కూడా ఉంది. వీరురువురూ రుద్రాక్షను మెడలో ధరిస్తుంటారు. రజనీతో 'చంద్రముఖి' లో నటించిన నయనతార కూడా ఇప్పుడు ఆయన బాటనే ఎంచుకుని బంగారు బ్రాస్ లెట్ లో రుద్రాక్ష పొదిగించి చేతికి ధరించింది.
Be first to comment on this News / Article!
|