జాడ తెలియని 'భీష్మ'
యువరత్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా ప్రకటించిన 'భీష్మ' చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది. నిజానికి ఈ చిత్రం లోగో ఆవిష్కరణ, పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. జూలై 29న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రకటించడంతో బాలయ్య అభిమానుల్లో ఉత్సాహం తొంగిచూసింది. అయితే ఆ తేదీ రావడం, వెళ్లిపోవడంతో 'భీష్మ' వెనుకబాట పట్టి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కీర్తి నిర్మించనున్న కొత్త చిత్రం ఈనెల 6న ప్రారంభంకాబోతుండటంతో 'భీష్మ' వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
బాలకృష్ణతో 'చెన్నకేశవరెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాలను సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన బెల్లంకొండ సురేష్ తన బ్యానర్ నుంచి ముచ్చటగా మూడోసారి బాలకృష్ణతో 'భీష్మ' చిత్రాన్ని అనౌన్స్ చేశారు. రమేష్ వర్మ ('రైడ్' ఫేమ్)ను దర్శకుడిగా ఎంపిక చేశారు. జూలై నెలాఖరులో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించి అదే ఫంక్షన్ లో హీరోయిన్లు, సాంకేతక నిపుణుల వివరాలు, విడుదల తేదీని కూడా అనౌన్స్ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ విధంగా జరక్కపోవడంతో 'భీష్మ' వెనకబాట పట్టి ఉండచ్చనే అభిప్రాయాలకు తావిస్తోంది. దీనికి తోడు బెల్లంకొండ సురేష్ ఇప్పటికే రవితేజతో రెండు సినిమాలకు ప్లానింగ్ చేశారు. ఇందులో ఒకటి కృష్ణవంశీ దర్శకత్వంలో ఉండబోతోంది. మరొకటి తమిళ హిట్ 'నాడోడిగళ్'కు రీమేక్ గా ఉండబోతోంది. ఈ రెండు చిత్రాలకు కమిట్ అయినట్టు రవితేజ కూడా ఇప్పటికే ప్రకటించారు. దీంతో బెల్లంకొండ-బాలకృష్ణ సినిమా ఒకింత వెనక్కి వెళ్లే అవకాశాలు లేకపోవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. అయితే 'భీష్మ'తొలి అడుగు ఇంకా పడకపోవడానికి ఇతమిద్ధమైన కారణాలు మాత్రం ఇంకా తెలియవలసి ఉంది.
Be first to comment on this News / Article!
|