సిక్స్ ప్యాక్ సిద్ధార్ధ
హీరోలకు సిక్స్ ప్యాక్, హీరోయిన్లకు టట్టూలు ఇప్పుడు ఇండియన్ సినిమాకు సరికొత్త ట్రెండ్ గా మారింది. 'నటన మాట ఎలా ఉన్నా ఇవాల్టి రోజుల్లో సిక్స్ ప్యాక్ ఉన్నవాడే హీరో' అంటూ వర్మ 'అడవి' లో ఓ తమాషా సంభాషణ కూడా ఉంది. ఆ మాట ఎలా ఉన్నా...తొలుత బాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ ఊపందుకుంది. ఫిజికల్ ఫిటెనెస్ ను మొదట్నించీ నమ్మే సల్మాన్ వంటి ఒకరిద్దరు హీరోలు మినహాయిస్తే షారూక్, అమీర్ వంటి మిడిల్ ఏజ్డ్ హీరోలు సైతం ఇటీవల సిక్స్ ప్యాక్ డవలప్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగులో ఈ తరహా ట్రెండ్ కు ఓరకంగా అల్లు అర్జున్ 'దేశముదురు'తో ఆద్యుడయ్యాడని చెప్పవచ్చు. ఆ తర్వాత నితిన్ 8 ప్యాక్ డవలప్ చేసి పలు సినిమాల్లో కనిపించారు. 'కుర్రోడు' చిత్రంలో వరుణ్ సందేష్, 'వరుడు' లో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ చేయబోతున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఇప్పుడు సిక్స్ ప్యాక్ హీరోల జాబితాలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్దార్ధ కూడా వచ్చిచేరబోతున్నారు.
'బొమ్మరిల్లు', 'కొంచెం కష్టం కొంచెం ఇష్టం' చిత్రాలతో తన లవర్ బాయ్ ఇమేజ్ ను పదిలం చేసుకున్న సిద్దార్ధ తన తదుపరి ప్రాజెక్ట్ ల విషయంలో దేహదారుఢ్యాన్ని పెంచుకుని సిక్స్ ప్యాక్ డవలప్ చేసే పనిలో పడినట్టు సమాచారం. సిద్దార్ధ ప్రస్తుతం యాక్షన్ తో కూడిన సోసియో ఫాంటసీ చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ చిత్రాన్ని కోవెలమూడి ప్రకాష్ (కె.రాఘువేంద్రరావు తనయుడు) దర్శకత్వంలో ఎబోడ్ (ఎ బెల్లీఫుల్ ఆఫ్ డ్రీమ్స్ ఎంటర్ టైన్ మెంట్) బ్యానర్ పై కె.రాఘువేంద్రరావు నిర్మించనున్నారు. దీనికితోడు అల్లరి రవిబాబు దర్శకత్వంలో మరో చిత్రాని కూడా సిద్దార్ధ కమిట్ అయినట్టు సమాచారం. ఇది యాక్షన్ ప్యాక్డ్ చిత్రమనీ, హృతిక్ రోషన్ హిందీ 'లక్ష్య' చిత్రానికి దగ్గరగా ఉంటుందనీ తెలుస్తోంది. తన కొత్త ప్రాజెక్ట్ లలో పాత్రలకు అనుగుణంగా సిద్దార్ధ సిక్స్ ప్యాక్ డవలప్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇందుకోసం అమీర్ ఖాన్ వ్యక్తిగత ఫిజికల్ ట్రైనర్ వద్ద సిద్దార్ధ శిక్షణ తీసుకోబోతున్నారు. లవర్ బాయ్ సిద్దార్ధ సిక్స్ ప్యాక్ తో యువ ప్రేక్షకుల గుండెల్లో ఎలాంటి గుబులు పుట్టించనున్నారనేది చూడాలి...
Be first to comment on this News / Article!
|