నాలుగు వందల ఏళ్లనాటి కథాగమనాన్ని ఇవాల్టి జనరేషన్ తో ముడిపెట్టి పునర్జన్మల కథాంశంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మగధీర' చిత్రం అనూహ్య ప్రజాదరణ చూరగొనడంతో పలువురు నిర్మాతలు సైతం ఇదే స్టోరీ లైన్స్ లో వరుస చిత్రాల నిర్మాణానికి అప్పుడే పావులు కదుపుతున్నారు. పాత చారిత్రక ఇతివృత్తాలను వెతికి పట్టుకుని ఇవాల్టి జనరేషన్ కు తగ్గట్టుగా వాటిని మోడ్రనైజ్ చేయాలనుకుంటున్నారు. రామ్ చరణ్ తర్వాత వంతు స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ దేనంటూ ఫిల్మ్ నగర్ వర్గాలు బలంగా నమ్మబలుకుతున్నాయి. ఆ ప్రకారం హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో 'పల్నాటి బాలచంద్రుడు' కథతో అల్లు అర్జున్ ఓ కొత్త చిత్రం చేయబోతున్నట్టు చెతున్నారు.
పల్నాటి వీరుడైన బాలచంద్రుడికి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉంది. పల్నాటు యుద్ధవీరుల సాహసాహాలతో 'పట్నాటి యుద్ధం' అనే చిత్రం చాలాకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ సైతం 'భారతంలో బాలచంద్రుడు'గా ఓ సాంఘిక చిత్రంలో నటించారు. ఇప్పుడు పల్నాటి బాలచంద్రుడి వీర గాథ, సాహసాలను ఫోకస్ చేస్తూ అల్లు అర్జున్ తో 'పల్నాటి బాలచంద్రుడు' తెరకెక్కించాలనే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని మళ్లీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే అల్లు అరవింద్ నిర్మించనున్నారని సమాచారం. చరిత్రను మరోసారి ఇవాల్టి జనరేషన్ ముందుకు తెచ్చేలా భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రం ఉంటుందని చెబుతున్నారు. 2011లో ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి. దర్శకుడి ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. 'హ్యాపీ' చిత్రం తర్వాత మళ్లీ అల్లు అర్జున్ సొంత బ్యానర్ లో నటిస్తున్న చిత్రం ఇదే అవుతుంది.