యాత్ 'లైఫ్ స్టైల్' 15న
'తాజ్ మహల్', 'రాజా', 'సందడే సందడి' వంటి కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ముప్పలనేని శివ తాజాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా 'లైఫ్ స్టైల్' చిత్రాన్ని తెరకెక్కించారు. కొత్త, పాత తారాగణంతో రూపొందించిన ఈ చిత్రంలో నిశ్చల్, కార్తీక్, అభిరామ్, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి ప్రధాన పాత్రధారులు. ఎస్.ఎం.సినీమాకస్ పతాకంపై కోగంటి రామకృష్ణ, మాధవ్ పట్నాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర దర్శక నిర్మాతలు హైద్రాబాద్ లో బుధవారంనాడు తెలిపారు.
స్నేహం ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందిందనీ, రామోజీ ఫిలింసిటీలోనూ, బాపట్ల కాలేజీలోనూ ఈ చిత్రం షూటింగ్ చేశామనీ కోగంటి రామకృష్ణ తెలిపారు. ముప్పలనేని శివ కూడా బాపట్లలోనే చదివారని అన్నారు. ఈ చిత్రానికి శ్రావ్య ఎంతో మంచి సంగీతం అందించిందనీ, ఆరు పాటలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. ముప్పలనేని శివ ఈ చిత్రాన్ని ఎంతో బాగా తెరకెక్కించారనీ, తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనీ మరో నిర్మాత మాధవ్ పట్నాయక్ తెలిపారు. ముప్పలనేని శివ మాట్లాడుతూ, నేటి యువతరం మనోభావాలను ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. సినిమాలోని మొదటి భాగం కాలేజీ నేపథ్యంలోనూ, రెండో భాగం కుటుంబ నేపథ్యంలోనూ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం తమ సినీ కెరీర్ కు మంచి పునాదులు వేస్తుందనే నమ్మకాన్ని ఈ సినిమాలో నటించిన యువ నటీనటులు వ్యక్తం చేశారు. నిశ్చల్, కార్తీక్, అభిరామ్, మీనాక్షి, అనన్య, కొమ్మినేని అంకమ్మ చౌదరి, ఘటికాచలం, లగడపాటి శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|