'మగధీర'ను అమ్మేశారా?
తెలుగులో ఒకప్పుడు పరభాషా సినిమాల రైట్స్ కు పోటీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ సీను మారింది. పరభాషా హీరోలు, నిర్మాతలు ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో కొత్త రిలీజ్ లపై ఓ కన్నేస్తున్నారు. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా రీమేక్ హక్కులకు బోలెడంత చెల్లించి ఎగరేసుకుపోతున్నారు. రామ్ చరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై ఇటీవల విడుదలైన 'మగధీర' చిత్రం ప్రేక్షకాదరణతో పలు రికార్డుల దిశగా దూసుకువెళ్తోంది. చైన్నైలో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన రజనీకాంత్ ఈ చిత్రాన్ని, రామ్ చరణ్ నటనకు ప్రశంసించడం కూడా ఈ చిత్రం రీమేక్ రైట్స్ పై తమిళ నిర్మాతల్లో పోటీని పెంచింది. ఈ పోటీలో విక్రమ్ తో 'మల్లన్న' చిత్రాన్ని 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించిన కలైపులి ఎస్.థాను ముందు వరుసలో ఉన్నారనీ, తమిళ రీమేక్ హక్కులను ఆయన తాజాగా సొంతం చేసుకున్నారనీ చెన్నై వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. అజిత్ ను హీరోగా అనుకుంటున్నట్టు కూడా చెబుతున్నారు. అయితే నిజానిజాలపై ఆరా తీసినప్పుడు ఈ ప్రచారం ఉత్తదేనని తేలింది.
'మగధీర' రైట్స్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కలైపులి థాను తోసిపుచ్చారు. అల్లు అరవింద్ సైతం మళ్లీ 'మగధీర' టీమ్ తోనే తమిళంలో రామ్ చరణ్ కథానాయకుడుగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నట్టు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తమిళనాట ఇప్పటికే 'మగధీర' చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఎక్కువైంది. పైరసీ వీసీడీలపై చట్టాలు కఠినంగా ఉండటం, అల్లు అరవింద్ చెన్నైలో ఓ యాంటీ పైరసీ టీమ్ ను రంగంలోకి దింపడం వల్ల 'మగధీర' ఇంకా పైరసీ కోరల్లో చిక్కలేదు. తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచనతోనే అల్లు అరవింద్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్టు చెబుతున్నారు. మంచి సమయం చూసుకుని తమిళ నేటివిటికీ దగ్గరగా కొద్దిపాటి మార్పులతో ఈ చిత్రాన్ని ఆయనే పునర్నిర్మించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|