'గోనగన్నారెడ్డి'గా ఎన్టీఆర్?
'అరుంధతి' సక్సెస్ తర్వాత పలు హారర్ చిత్రాలు వెల్లువెత్తాయి. తాజాగా 'మగధీర' చిత్రం పీరియాడిక్ ఫిల్మ్ గా సెన్సేషన్ సృష్టిస్తుండటంతో ఇప్పుడు పలువురు టాలీవుడ్ ప్రముఖులు చారిత్రక ఇతివృత్తాలతో కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్లతో సంచలన చిత్రాలను నిర్మించడంలో దిట్ట అయిన గుణశేఖర్ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కు కార్యరూపంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా భోగట్టా.'ఒక్కడు', 'అర్జున్' వంటి హెవీ బడ్జెట్ చిత్రాలను అందించిన గుణశేఖర్ ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడుగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం చారిత్రక వీరనారి 'రుద్రమ దేవి' చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రాయలసీమ వారియర్ ప్రిన్స్ గా పేరున్న రుద్రమదేవి చరిత్రకు సంబంధించి ఇప్పటికీ రీసెర్చ్ వర్క్ చేసి స్క్రిప్టు సైతం రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అత్యంత పవర్ ఫుల్ గా 'గోన గన్నారెడ్డి' పాత్ర ఉండబోతోందనీ, ఈ పాత్ర కోసం ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సంప్రదించారనీ సమాచారం. ఈ సీజన్ లోనే ఈ చిత్రానికి ఒక కార్యరూపం ఇవ్వాలనే ఆలోచలో గుణశేఖర్ ఉన్నారు.
గుణశేఖర్ తరహాలోనే ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు సైతం 'చండీ' అనే గ్రాఫిక్ ప్రధానంగా సాగే భారీ బడ్జెట్ చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్ పాత్ర కోసం తొలుత నయనతారను సంప్రదించారనీ, ప్రస్తుతం అనుష్కను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తికానుంది. ఆసక్తికరంగా హాలీవుడ్ 300 చిత్రం తరహాలో ఓ చారిత్రక ఇతివృత్తాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు రసూల్ సైతం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ లో హిస్టారికల్ కథాంశాల ఫీవర్ స్పష్టంగా కనిపిస్తోంది.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|