'మగధీర'కు కొత్త జోడింపు!
రామ్ చరణ్ 'మగధీర' చిత్రం సంచలన విజయంతో పాటు రికార్డు స్థాయిలో 'వివాదాల'నూ ఎదుర్కొంటోంది. కథ విషయంలో కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనీ, లాయర్లను కించపరచారనీ, పాట పల్లవిని అనుచితమైన పద్ధతిలో వాడుకున్నారనీ...ఇలా వరుస వివాదాలు 'మగధీర' టీమ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సినిమాలో శ్రీహరి నటించిన షేర్ ఖాన్ పాత్ర ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా ముస్లింల కన్నెర్రకు కారణమవుతోంది. ఇందులో ముస్లింల మత జెండాను అవమానించేలా ఓ సన్నివేశం ఉందనీ, నమాజ్ చేసే తరహాలో సైనికుల ముక్కుని నేలకు తాకేలా చేశారనీ ఆరోపిస్తూ మచిలీపట్నానికి చెందిన యూనిస్ అనే వ్యక్తి కేసు వేసారు. ఈ వివాదాల పర్యవసానం మాటెలా ఉన్నా..తాజాగా ఈ చిత్రానికి కొన్ని అదనపు సన్నివేశాలను జోడించనునట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా భోగట్టా.
సినిమా ఓ మోస్తరుగా ఉందనే టాక్ వచ్చినప్పుడు ఒక పాటనో, ఎడిట్ చేసిన సన్నివేశాలను తిరిగి జోడించడమో అడపాదడపా జరుగుతుంటుంది. అయితే 'మగధీర' సూపర్ హిట్ గా డిక్లేర్ అయిన తరుణంలో అదనపు సన్నివేశాల జోడింపు జరుగనుందని సమాచారం. ఇందులో తన పాత్ర కొంత కత్తిరింపునకు గురైందంటూ శ్రీహరి అసంతృప్తితో ఉన్నారనీ, ఇది గ్రహించిన నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు ఊరట కలిగిస్తూ త్వరలోనే ఆ తొలగించిన సన్నివేశాలను జోడిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇవి సాల్మన్ రాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాలుగా చెబుతున్నారు. శ్రీహరి ఈ చిత్రంలో షేర్ ఖాన్ పాత్రతో పాటు సాల్మన్ రాజు క్యారెక్టర్ ను కూడా పోషించారు. 'మగధీర' 50 రోజులు పూర్తయిన తర్వాత శ్రీహరి సన్నివేశాల జోడింపు ఉంటుందని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|