నాగచైతన్య 'జోష్' 3న
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడు పరిచయమవుతున్న చిత్రం 'జోష్'. దీనికి 'యాత్ రాక్స్ ' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. వాసువర్మ (తొలిపరిచయం) దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు దిల్ రాజు హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం తెలిపారు.
నాగార్జున తమ మీద ఉన్న నమ్మకంతో నాగచైతన్యను పరిచయం చేసే అవకాశం తమకు కల్పించారనీ, చక్కటి క్వాలిటీ తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామనీ చెప్పారు. తొలుత ఈనెల 12న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ వీలుపడక పోవడంతో నాగార్జున జన్మదినోత్సవం సందర్భంగా 28న విడుదల చేయాలని అనుకున్నామనీ, అయితే సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్ చేస్తున్నామనీ తెలిపారు. సాంకేతికంగా అద్భుతంగా ఉండాలనే తపనతో సూపర్ 35 కెమెరాను ఉపయోగించామనీ, హీరోహీరోయిన్లతో పాటు 30 మంది కొత్త నటీనటులు ఇందులో నటించారనీ చెప్పారు. అందిరిచేతా సొంతగానే డబ్బింగ్ చెప్పించామనీ తెలిపారు. దీంతో విడుదల విషయంలో కాస్త ఆలస్యమైందన్నారు. కాలేజీ కుర్రాడి కథతో సాగే చిత్రమనిదనీ, మంచి వినోదం ఉంటుందనీ చెప్పారు. పాటలన్నీ సందర్భానుసారం ఉంటాయనీ, ఆడియో మంచి హిట్ అయ్యిందనీ అన్నారు. నాగచైతన్యతో పాటు దర్శకుడిగా వాసువర్మను, హీరోయిన్ గా రాధ కుమార్తె కార్తీకను పరిచయం చేస్తున్నామనీ, సందీప్ చౌతా సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ప్రేక్షలను ఎంతగానో అలరిస్తాయని అన్నారు. తమ సంస్థ నిర్మిస్తున్న 9వ చిత్రమిదనీ, దీంతో ట్రిబుల్ హ్యాట్రిక్ సాధిస్తామనే నమ్మకం తమకుందనీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సహనిర్మాతలు లక్ష్మణ్, శిరీష్ సైతం పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జె.డి.చక్రవర్తి, బ్రహ్మానందం, సితారం, ఆనంద్, సూర్య తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం వాసువర్మ అందించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి-చంద్రబోస్ పాటలు, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|