'కమీనే'గా నారా హీరో?!
నందమూరి హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్ ఆశీస్సులతో నారా వారి ఫ్యామిలీ నుంచి 'బాణం'లా దూసుకు వస్తున్న హీరో నారా రోహిత్. నారా చంద్రబాబునాయుడు సోదరుడి తనయుడైన నారా రోహిత్ తొలిసారిగా హీరోగా పరిచయమవుతున్న 'బాణం' చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ చలసాని నిర్మాతగా త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ పతాకంపై చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం పాటలను ఇటీవలే ఒక్కో పాటను ఒక్కో ఛానెల్ ద్వారా వినూత్న శైలిలో రిలీజ్ చేశారు. ఈమధ్యనే 'సంతోషం 200' అవార్డుల వేదిక నుంచి రోహిత్ తొలిసారి ప్రేక్షకులకు తనను తాను పరిచయం చేసుకున్నారు. దీంతో రోహిత్ నటన ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టే నారా రోహిత్ ఇప్పుడు తన రెండో చిత్రానికి కూడా ప్లానింగ్ చేసుకుంటున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. హిందీలో ఇటీవల విడుదలై విజయవంతంగా నడుస్తున్న 'కమీనే' చిత్రం తెలుగు రీమేక్ లో నారా రోహిత్ నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రా జంటగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 'కమీనే' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో షాహిద్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం రీమేక్ పై నారా రోహిత్ ఆసక్తిగా ఉన్నారనీ, అయితే ద్విపాత్రాభినయానికి తగినంత ప్రతిభ ఆయనలో ఏమేరకు ఉందో 'బాణం' విడుదల తర్వాతే తేలుతుందని ఫిల్మీ వర్గాలు అంటున్నాయి. 'బాణం' సక్సెస్ అయితే రోహిత్ దశ తిరిగే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|