'చండీ' హీరోయిన్ గా హన్సిక!
సిమ్లా యాపిల్ ను తలపించే హన్సిక మోత్వాని ఇప్పుడు వివిధ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. హిందీలో తన ఉనికిని చాటుకుని 'దేశముదురు'తో టాలీవుడ్ లో పాగా వేసింది. ఆ చిత్రం తర్వాత ఆమె నటించిన 'కంత్రి', 'మస్కా' చిత్రాలు కమర్షియల్ సక్సెస్ ను సాధిస్తే, ప్రత్యేక పాత్రలో నటించిన 'బిల్లా' సైతం సెంచరీ కొట్టింది. ప్రస్తుతం నితిన్ సరసన ఎమ్మెల్యే విజయ ప్రసాద్ ('సిద్ధు ఫ్రమ్ సికాకుళం' ఫేమ్) నిర్మాతగా ఈశ్వర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హన్సిక కథానాయికగా నటిస్తోంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ సరసన 'మాపిల్లై' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ కోలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. తాజాగా మరో అరుదైన అవకాశం కూడా హన్సిక తలుపుతట్టినట్టు సమాచారం. అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం.
భారీ చిత్రాల నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ఎం.ఎస్.రాజు 'చండీ' పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'అరుంధతి' తరహాలో, కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కునుంది. కొద్దిరోజులుగా హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. తొలుత అనుష్కను అనుకున్నప్పటికీ ప్రస్తుతం ఆమెకున్న కమిట్ మెంట్ల దృష్ట్యా నయనతార పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇటీవల 'ఆంజనేయులు' విడుదల అనంతరం నయనతారకు బదులుగా హన్సిక అయితే బాగుటుందనే అభిప్రాయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్టు చెబుతున్నారు. ఇందులో విలన్ గా తమిళ హీరో ఆర్య ను అనుకుంటున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎమ్మెస్ రాజు తెలియజేయనున్నారు. ఈ ఏడాదే ఈ కొత్తచిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|