తడబడిన దిల్ రాజు?
నిర్మాతగా, పంపిణీదారుగా అప్రతిహతంగా సక్సెస్ లతో దూసుకుపోతున్న దిల్ రాజు అడుగు తడబడిందా? డేరింగ్ ప్రొడ్యూసర్ గా పేరున్న దిల్ రాజు ఇటీవల కాలంలో ఏకకాలంలో రెండు మూడు చిత్రాలను రూపొందిస్తూ తన వేగం పెంచారు. పనిలో పనిగా దిల్ రాజు హ్యాండ్ పడితే సినిమా హిట్టనే ప్రచారం కూడా ఉండటంతో బయట సినిమాలు కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో దిల్ రాజు కాస్తా ఈమధ్యన నైజాం రాజుగా మారి నైజాం ఏరియాలోనే ఎక్కువగా బయట సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 'హ్యాపీడేస్' డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుని కోట్లలో లాభం పొందారు. ఆ తర్వాత చేసిన 'వినాయకుడు', 'యువత' కూడా హిట్టే. అయితే జగపతిబాబు 'హోమం', వరుణ్ సందేష్ 'ఎవరైనా ఎపుడైనా' ఫ్లాపుల జాబితాలోకి చేరిపోయాయి. అయితే ఆ రెండు చిత్రాల విషయంలో దిల్ రాజు నైజాం ఏరియా రైట్స్ కోసం పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చేసిందట. తాజాగా ఆయన విక్రమ్ కథానాయకుడుగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చిన 'మల్లన్న' చిత్రాన్ని భారీ ఆఫర్ తో నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారు. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా సినిమా టాక్ నీరసంగా ఉండటంతో దిల్ రాజు డబ్బులు తిరిగిరావడం అంత సులువేం కాదని పరిశ్రమకు చెందిన వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. దిల్ రాజుకు 'పెద్ద' దెబ్బ పడినట్టేనని వారంటున్నారు.
లాభనష్టాల బేరేజీ మాటెలా ఉన్నా దిల్ రాజు రాబోయే దసరా సీజన్ లోనూ తన సత్తాను బలంగా చాటుకోబోతున్నారు. నాగచైతన్య కథానాయకుడుగా ఆయన నిర్మించిన 'జోష్' భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 3న విడుదలవుతోంది. దసరా పండుగకు చాలా ముందే వస్తున్న ఈ చిత్రం పండుగ సీజన్ ను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుందా అనేది పరిశ్రమ వర్గాలను ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది. దసరా సీజన్ కే రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'గణేష్ ' (జస్ట్ గణేష్) సినిమా కూడా ఇప్పుడు దిల్ రాజు చేతిలోకి వచ్చింది. ఈ చిత్రం నైజాం ఏరియా రైట్స్ ను 4.5 కోట్లకు దిల్ రాజు దక్కించున్నారని చెబుతున్నారు. 'మల్లన్న'తో దిల్ రాజుకు భారీ నష్టం వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని తన పబ్లిసిటీ స్కిల్స్ తో నైజాంలో గట్టెక్కించి..'జోష్'...'గణేష్'తో తన బిజినెస్ స్ట్రాటజీకి తిరుగులేదని మరోసారి చాటుకుంటారేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|