వయసుడిగిన అల్లు అర్జున్!
ఇవాల్టి యువతరం హీరోలకు విలక్షణ పాత్రలనేవి అందని ద్రాక్ష అవుతోంది. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోలు సైతం అప్పట్లో ఇమేజ్ ను పక్కనపెట్టి విలక్షణ పాత్రల వైపు మొగ్గుచూపడం వల్లనే ఇప్పటికీ వారు పోషించిన విభిన్న భూమికలు అజరామరంగా నిలుస్తున్నాయి. ఎన్టీఆర్ సైతం తన సినిమాల్లో పలు మారువేషాలు ఉండేలా చూసుకునేవారు. అలా చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. తరాలు మారి ఇప్పటి తరంలో స్టార్ ఇమేజ్ చట్రంలోనే హీరోలు బందీ అయిపోతున్నారు. రచయితలకు కూడా తగినంత స్వేచ్ఛ లేదు. స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ ఇంతవరకూ తనకున్న యాక్షన్ ఇమేజ్ నుంచి నటనను ఆస్కారమున్న పాత్రల వైపు ఇటీవల ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అందుకు నిదర్శనమే 'పరుగు'లోని ఆయన క్యారెక్టర్. ప్రస్తుతం 'ఆర్య-2', గుణశేఖర్ చిత్రాల్లోని క్యారెక్టర్లు కూడా విలక్షణంగానే ఉండబోతున్నాయి. దీనికి అదనంగా క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న 'వేదం'లోనూ అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకొంది. ప్రస్తుతం ప్రచారార్భాటాలకు దూరంగా సైలెంట్ గా షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు మంచు మనోజ్ కుమార్, అనుష్క, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆసక్తికరంగా ఇందులో ఓ వృద్ధ పాత్ర కూడా ఉంది. ఆ పాత్రే మెయిన్ హీరో అనే ప్రచారమూ జరుగుతోంది. ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారేది సస్పెన్స్ గానే ఉంచారు. అయితే ఆ వృద్ధుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారంటూ ఫిలిం సర్కిల్స్ లో తాజాగా వినిపిస్తోంది. ఇందులో నిజానిజాల మాటెలా ఉన్నా ఇరవైలో అరవైగా కనిపించాలంటే ఏ నటుడికైనా ఛాలెంజే. అల్లు అర్జున్ ఎలా ఒదుగుతాడో మరి..
Be first to comment on this News / Article!
|