పరిశ్రమను నమ్ముకుని నాలుగు డబ్బులు వెనుకేసుకుంటూ స్టార్ స్టాటస్ ను ఎంజాయ్ చేస్తున్న పలువురు నటీనటులు తాము నటిస్తున్న చిత్రాల ప్రమోషన్ వర్క్ విషయంలో మాత్రం నిర్మాతలకు ముఖం చాటేస్తుంటారు. దీంతో నిర్మాతలు కేవలం డబ్బులు పెట్టుబడి పెట్టే ఎ.టి.ఎం.లు గానే మిగిలిపోతుంటారు. ఈ వ్యవహారం రానురానూ నిర్మాతలకు కన్నెర్ర అవుతోంది. దక్షిణాదిన తన ఆందచందాలతో ఆకట్టుకుంటున్న నమితపై ఇప్పుడు తమిళ నిర్మాతల మండలి చర్య తీసుకునే ఆలోచనలో ఉంది.
నమిత తాజాగా నటిస్తున్న 'అళగాన పొన్నదాన్' (అందమైన అమ్మాయి) చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిదింది. ఈ వేడుకకు నమిత గైర్హాజరైంది. ఇది నిర్మాతల మండలి ఆగ్రహానికి కారణమవుతోంది. సినిమా ఫంక్షన్లకు హాజరుకాని నటీనటులపై చర్యలు తీసుకుంటామని నిర్మాతల మండలి కార్యదర్శి శివ శక్తి పాండియన్ ఇటీవల ఓ కార్యక్రమంలో హెచ్చరించారు. ఆడియో ఫంక్షన్ కు నమిత హాజరు కాకపోవడాన్ని ఆయన సీరియస్ గా తీసుకుంటూ గతంలోనే తాము ఇలాంటి హెచ్చరికలు చేసినట్టు గుర్తుచేశారు. 'ఫెఫ్సి' అధ్యక్షుడు వి.సి.గుహనాథన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు రామనారాయణ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రామనారాయణ్ ఈ విషయంలో గట్టి పట్టుగా ఉండటంతో పాటు నడిగర సంఘంతో సంప్రదింపులకు కూడా సిద్ధపడుతున్నారు. ఆ తర్వాతే నమితపై చర్య తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.