ఎన్టీఆర్ సరసన షామిలి
బాలనటిగా తొలిచిత్రం 'అంజలి'తో జాతీయ అవార్డును అందుకున్న షామిలి దాదాపు 40 చిత్రాల్లో నటించి ఆ తర్వాత చదువుల పేరుతో బ్రేక్ తీసుకుంది. ఈమధ్యనే ఆమె హీరోయిన్ గా 'ఓయ్' చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం యావరేజ్ మార్కులే వేయించుకున్నా షామిలికి అభినయం పరంగా మంచి పేరే వచ్చింది. ఆ చిత్రం తర్వాత షామిలి ఇంతవరకూ ఏ కొత్త చిత్రానికి కమిట్ కాలేదు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఆమెను వరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.
భారీ చిత్రాల దర్శకుడుగా పేరున్న గుణశేఖర్ కు చాలాకాలంగా 'గోన గన్నారెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించాలనే కోరిక ఉంది. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. 'మగధీర' చిత్రం సాధించిన సక్సెస్ తో ఇప్పుడు పలువురు దర్శకనిర్మాతలు చారిత్రక కథాంశాల వేటలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చారిత్రక వీరుడు 'గోన గన్నారెడ్డి'కి సంబంధించిన స్క్రిప్టును గుణశేఖర్ కొద్దికాలంగా రెడీ చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ పేరును తొలుత పరిశీలించినప్పటికీ చివరకు ఎన్టీఆర్ తో ఈ చిత్రం తీయాలనే పట్టుదలతో గుణశేఖర్ ఉన్నారని సమాచారం. ఇందులో గ్రామీణ యువతి పాత్రలో షామిలి అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి 40 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారనీ, ఈ ప్రాజెక్ట్ కోసం పలువురు అగ్ర నిర్మాతలను గుణశేఖర్ సంప్రదిస్తున్నారనీ చెబుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడుగా 'వరుడు' చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ సైతం వినాయక్ 'అదుర్స్'లో నటిస్తూ, దిల్ రాజు నిర్మించనున్న 'బృందావనం', అశ్వనీదత్ నిర్మాతగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి కమిట్ అయ్యారు. అన్నీ సజావుగా జరిగితే ఎన్టీఆర్-గుణశేఖర్ 'గోన గన్నారెడ్డి' వచ్చే ఏడాది సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|