వైఎస్ చరిత్రతో దాసరి చిత్రం!
స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ కొత్త చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించేందుకు దర్శకరత్న దాసరి నారాయణరావు ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ చరిత్రతో 'లోకనాయకుడు' అనే చిత్రాన్ని నిర్మించనున్నట్టు హీరో రాజశేఖర్ ప్రకటించారు. టైటిల్ ను కూడా ఆయన రిజిస్టర్ చేయించారు.
దాసరి నారాయణరావు ఇంతవరకూ 148 చిత్రాలకు దర్శకత్వం వహించిన గిన్నెస్ రికార్డు సాధించారు. 149వ చిత్రంగా 'యంగ్ ఇండియా' అనే చిత్రాన్ని ఇటీవలే ఆయన ప్రకటించారు. అంతా కొత్త తారలతో ఆయన ఈ చిత్రాన్ని త్వరలోనే తెరకెక్కించనున్నారు. ఆసక్తికరంగా ఆయన 150వ చిత్రం వై.ఎస్. నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసే చిత్రమే అవుతుందని అంటున్నారు. అధికారికంగా ఇంకా ఈ విషయం ధ్రువీకరణ లేదు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్. పాత్రను డాక్టర్ ఎం.మోహన్ బాబు పోషించనున్నారనీ, వై.ఎస్.తండ్రి రాజారెడ్డి పాత్ర కోసం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒప్పించాలని అనుకుంటున్నారనీ చెబుతున్నారు. మోహన్ బాబు, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 'పెదరాయుడు' అప్పట్లో సంచనల విజయం సాధించింది. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ కాంబినేషన్ ను పునరావృతం చేయాలని ఆనుకుంటున్నట్టు సమాచారం. అలాగే తెలుగు, తమిళ భాషలకు చెందిన పలువురు ప్రముఖ తారలను కూడా ఈ చిత్రం కోసం ఎంపిక చేయనున్నారట. మరోవైపు వై.ఎస్. పట్ల తన కుంటుబ సభ్యులకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ హీరో రాజశేఖర్ సైతం ఇటీవలే 'లోకనాయకుడు' అనే చిత్రాన్ని శివానీ-శివాత్మిక మూవీస్ బ్యానర్ పై నిర్మించాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. వీటికితోడు వై.ఎస్. జీవించి ఉండగానే సిసిరెడ్డి సమర్పణలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రంలో (ఇంకా పేరు పెట్టలేదు) తొలిసారిగా నటించారు. ఇందులో ముఖ్యమంత్రి పాత్రనే వై.ఎస్. పోషించారు. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|