'లీడర్'కు టైటిల్ చిక్కు?
డాక్టర్ డి.రామానాయుడు మనువడు దగ్గుబాటి రానా (రామానాయుడు)ను హీరోగా పరిచయం చేస్తూ ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ పై రూపొందుతున్న చిత్రానికి 'లీడర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు టైటిల్ లో స్వల్ప మార్పు చోటుచేసుకోనుందని సమాచారం.'డాలర్ డ్రీమ్స్'తో మొదలుపెట్టి 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీడేస్' వంటి వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన శేఖర్ కమ్ముల తొలిసారిగా పాలిటిక్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం సహజంగానే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కథాంశానికి అనుగుణంగా 'లీడర్' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారార్భాటాలకు దూరంగా ఈ చిత్రం కొద్ది కాలంగా నిర్మాణం జరుపుకొంటోంది. తాజా సమాచారం ప్రకారం ఇదే టైటిల్ ను మరొకరు రిజిస్టర్ చేయించుకోవడం వల్ల ఇప్పుడు టైటిల్ లో మార్పు అనివార్యం కానుందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి 'ఏవియం వారి లీడర్' అనే పేరు పెట్టాలని అనుకుంటున్నారట. అయితే ఎవిఎం వారి అనే అక్షరాలు చిన్నవిగా, లీడర్ అనే అక్షరాలు పెద్దవిగా ఉండబోతోంది. పూర్తి పేరుతోనే టైటిల్ రిజిస్ట్రేషన్ ఉంటుందట.
రానా తొలిసారి పరిచయమవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల కొన్ని కీలక సన్నివేశాలను జనం మధ్య చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందనీ, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవుతాయనీ తెలుస్తోంది. ఇందులో రాణా సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రియాఆనంద్ ప్రధాన హీరోయిన్ కాగా, బెంగాలీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్ (మిస్ ఇండియా యుఎస్ఎ 2007) మరో హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ హరిప్రియ నటిస్తోంది. అక్టోబర్ చివర్లో కానీ, నవంబర్ ప్రథమార్ధంలో కానీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Be first to comment on this News / Article!
|