హీరోల డామినేషన్ ఉండే సినీరంగంలో హీరోయిన్లు నిలబడాలంటే గ్లామర్ ప్రదర్శనే ప్రధాన ఆస్త్రం అవుతుంటుంది. నటనకు స్కోప్ ఉన్న హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు ఎప్పుడో కానీ రావు. ఇలాంటప్పడు సినిమా సినిమాకి గ్లామర్ డోస్ పెంచుతూ ఎప్పుడూ డిమాండ్ లో ఉండేందుకు కుర్ర హీరోయిన్లు పోటీపడుతుంటారు. ఇలియానా ఈ మధ్యనే 'కిక్'లో యోగా పేరుతో చేసిన విన్యాసాలు యూత్ లో ఆమెకు మరింత క్రేజ్ తెచ్చింది. సంప్రదాయ బద్ధంగా కనిపించే త్రిష సైతం తాజాగా గోపీచంద్ 'శంఖం'లో గ్లామర్ తలుపులు బార్లా తెరిచింది. లిప్తపాటులో కనిపించే ఓ లిప్ కిస్ లోనూ నటించింది. నయనతార తమిళ 'బిల్లా'లో బికినీ డ్రెస్ లో సృష్టించిన సంచలనం ఇందుకు ఏమాత్రం తీసిపోదు. ఆసక్తికరంగా నయనతార ఇక గ్లామర్ తలుపులు మూసేయబోతోందంటూ తాజాగా ఓ ప్రచారం బయటకు వచ్చింది.
నయనతార ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'అదుర్స్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 'మస్కా'తో యూత్ కు గ్లామర్ టచ్ లు ఇచ్చిన షీలా ఇందులో మరో కథానాయిక. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఇద్దరి కథానాయికల మధ్యా పోటాపోటీ గ్లామర్ ప్రదర్శన ఉండబోతోందని ప్రేక్షకులు అంచనా వేయడం సహజం. అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశం కోసం నయనతార గ్లామర్ డోస్ పెంచినట్టు కనిపించే దుస్తులు ధరించాల్సి వచ్చిందట. ఇందుకు నయనతార నిరాకరించిందట. ఇకముందు కూడా ఇదే పద్ధతి పాటించాలనుకుంటున్నట్టు చెప్పిందట. అధికారికంగా ఇంకా ఈ విషయం ధ్రువీకరణ కానప్పటికీ ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. ఆసక్తికరంగా నయనతారను 2006లో 'లక్ష్మీ' చిత్రంతో వినాయక్ తెలుగుతెరకు పరిచయం చేశారు. నయనతార తాజా నిర్ణయం వెనుక త్వరలోనే వివాహంతో సెటిల్ కావాలనే అభిప్రాయం కారణం కావచ్చనే అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.