స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి జనంలో తిరుగులేని ఇమేజ్ ఉండటంతో దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే తపన ఇప్పుడు పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులైన డాక్టర్ జీవిత రాజశేఖర్ దంపతులు అందరి కంటే ముందే మీడియా ముందుకు వచ్చి వై.ఎస్. జీవిత చరిత్ర ఆధారంగా 'రాజశేఖర్ రెడ్డి' అనే చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. వైష్ణో అకాడమీ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ఇందుకు కొంత రీసెర్చ్ వర్క్ జరిపి పక్కా స్క్రిప్టు రెడీ చేసేందుకు జీవిత, పూరీ జగన్నాథ్ సన్నద్ధమవుతున్నారు. మరోవైపు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే తొలిసారి ముఖానికి మేకప్ వేసుకుని సిఎం పాత్రలోనే నటించిన మరో చిత్రం కూడా ఇప్పుడు బ్యాలెన్స్ వర్క్ ముగించుకునేందుకు సిద్ధమవుతోంది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో సి.సి.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది టాకీ ల యుగంలో వస్తున్న మూకీ చిత్రం కావడం విశేషం. బ్రహ్మానందం కథానాయకుడుగా నటించిన ఈ చిత్రం 90 శాతం షూటింగ్ ముగించుకుని కారణాంతరాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రాన్ని ముందుకు తెచ్చేందుకు ప్లానింగ్ జరుగుతోంది. వీటితో పాటు వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రాన్ని శ్రీ అమ్మ అర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై డి.రమేష్ నిర్మిస్తున్నారు. పి.సి.ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చేవెళ్ల నుంచే 1400 కిలోమీటర్లు వైఎస్ చేసిన పాదయాత్ర ను జ్ఞప్తికి తెస్తూ అదే చేవెళ్ల లో షూటింగ్ మొదలుపెట్టి 'పాదయాత్ర' అనే టైటిల్ ను కూడా నిర్మాత ఖరారు చేశారు. ఇక రాజశేఖర్ రెడ్డిపై అభిమానం చాటుకుంటూ ఆయనకు అంకిత మిస్తున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ జాడ తెలియడం లేదని వార్త బయటకు వచ్చిన వెంటనే నాగచైతన్య 'జోష్' చిత్రాన్ని దిల్ రాజు వాయిదా వేసి రెండ్రోజుల తర్వాతే థియేటర్ల ముందుకు తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని రాజశేఖర్ రెడ్డికి అంకితమిచ్చారు కూడా. దీని వెంటనే విడుదలైన మరో రెండు చిత్రాలు కూడా ఆయనకు అంకిత మిస్తున్నట్టు టైటైల్ కార్డ్స్ లో వేశారు. తాజాగా రామ్ పెన్నా అనే నిర్మాత తన నిర్మాణ సంస్థకు వైఎస్ఆర్ ఫిలింస్ అనే పేరు పెట్టి ఆంగ్ల చిత్రం 'ఈవిల్ బర్డ్స్'ను తెలుగులోకి అనువదిస్తున్నారు. దీనికి 'పావురాల గుట్ట' అనే టైటిల్ కూడా పెట్టారు. పావురాల గుట్ట పేరు ఇటీవల ఏరకంగా వార్తల్లోకి వచ్చిందో అందరికీ తెలుసు. అందుకనే ఏ పని చేసినా పుణ్యం..పురుషార్ధం కూడా ఉండాలంటారు మరి...