బాణం ఓకే..ఈనాడు సోసో!
దసరా సీజన్ లో కొత్త సినిమాల సందడి సహజం. అయితే పండక్కి కొద్ది ముందుగా గత వారంలో 3 సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోరుతూ రిలీజ్ అయ్యాయి. వీటిలో మల్టీస్టారర్ 'ఈనాడు', నారా రోహిత్ 'బాణం', రాజా 'సమర్ధుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తొలి రెండు చిత్రాలు మిశ్రమ స్పందన చవిచూస్తుంటే, మూడో చిత్రం ప్రేక్షకుల చెంతకు చేరడంలో చతికిలపడినట్టు ట్రేడ్ రిపోర్ట్.
కమల్ హాసన్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో సొంతంగా నిర్మిస్తూ నటించిన చిత్రం 'ఈనాడు'. హిందీలో విజయవంతమైన 'ఎ వెన్స్ డే' చిత్రానికి ఇది రీమేక్ కావడం, కమల్ తో పాటు కీలకమైన పోలీస్ కమిషనర్ పాత్రను విక్టరీ వెంకటేష్ పోషించడంతో సహజంగానే రిలీజ్ కు ముందు మంచి అంచనాలు ఏర్పరచుకుంది. చక్రి తోలేటి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం కంటెంట్, పిక్చరైజేషన్ పరంగా క్లాస్ ప్రేక్షకులను దగ్గరగా ఉండి ఆ వర్గాన్ని ఆకట్టుకుంటోంది. సాంకేతిక ప్రమాణాలు మెచ్చుకోదగిన రీతిలో ఉన్నప్పటికీ మాస్ ఎలిమెంట్స్ లోపించడం వల్ల క్లాస్ ముద్ర వేయించుకుంది. కమల్ నటనకు వంక పెట్టడం సాధ్యం కానప్పటికీ వెంకటేష్ పాత్ర ఆడియెన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. తొలివారంలో కలెక్షన్లు ఫర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి. నారాచంద్రబాబునాయుడు తమ్ముడైన నారా రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ 'బాణం' చిత్రం ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డాక్యుమెంటరీ తరహా పోకడలు సినిమా నడకలో ఉన్నాయంటూ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నప్పటికీ దర్శకుడు ఈ చిత్రాన్ని రొటీన్ కు భిన్నంగా తెరకెక్కించడం, హీరో క్యారెక్టరైజేషన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఈ చిత్రానికి క్రమంగా ప్రేక్షకాదరణ పెరుగుతోంది. కొద్దిరోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో రాజాకు 'అసమర్ధుడు' సైతం తేరుకోలేకుండా చేసింది. ఈ చిత్రం విడుదలైన విషయమే చాలామందికి తెలియని పరిస్థితి ఉంది. చూసిన కొద్దిమంది 80వ దశకంలో రావాల్సిన సినిమాగా పెదవి విరుస్తున్నారు. వీటికంటే కొంచెం ముందుగా విడుదలైన గోపీచంద్ 'శంఖం' చిత్రం ఓపినింగ్స్ బాగానే రాబట్టినా టాక్ ఫేవరబుల్ గా లేదు. రొటీన్ మూస చిత్రాల తరహాలోనే ఉందనే ముద్ర వేయించుకుంది. నాగచైతన్య 'జోష్' సరైన జోష్ ఇవ్వలేకపోతోంది. రామ్ చరణ్ మగధీర 50 రోజులు పూర్తి చేసుకుని తలెత్తుకుని వడివడిగా సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. రిపీటెడ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|