సునయనపై ఆకాష్ కేసు!
హీరో ఆకాష్ ఒక హిట్ కోసం పడుతున్న తపన అందరికీ తెలిసిందే. 'ఆనందం' చిత్రంతో తొలి హిట్ సాధించిన ఆకాష్ అప్పట్లో హీరోగా బిజీ అయ్యాడు. అయితే సినిమాల ఎంపికలో లోపాల వల్లనో మరో కారణం వల్లనే ఆ తర్వాత మళ్లీ ఆయనకు సరైన బ్రేక్ రాలేదు. ఇటీవల కాలంలో హీరోగా నటిస్తూనే అడపాదడపా స్పెషల్ రోల్స్ కూడా చేస్తున్నారు. నటి సునయన పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఈ ఇద్దరూ కలిసి 'మదన్' అనే చిత్రంలో నటించారు. పలు అడ్డంగులు అధిగమించి ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సునయన ఇటీవల ఆకాష్ పై దక్షిణ భారత ఆర్టిస్టుల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఫిల్మీ వర్గాల భోగట్టా. ఇందులో తాను ఆకాష్ తో కలిసి నటించిన కొన్ని సన్నివేశాలను ఆయన మార్ఫింగ్ చేసి పబ్లిసిటీ పొందాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇందుకు ఆకాష్ సైతం గట్టిగానే బదులిచ్చారు. తనతో ఇంటిమేట్ సన్నివేశాలు చేసింది సునయనేననీ, మార్ఫింగ్ వంటి చీప్ ట్రిక్స్ చేయాల్సిన అవసరం తనకు లేదని ఆయన చెబుతున్నారు.
'మదన్' చిత్రంలో కథానాయిక పాత్రకు సునయనను ఎంపిక చేశారనీ, అయితే ఇటీవల తన కాలికి గాయం కావడం వల్ల షూటింగ్ ఆగిందనీ, తర్వాత ఆర్థిక సంక్షోభం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందనీ ఆయన చెప్పారు. ఎట్టకేలకు ఆ అవరోధాలన్నింటిని అధిగమించి ఇప్పుడు సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో సునయన కొత్త చిక్కులు సృష్టిస్తోందంటూ ఆయన ఆరోపించారు. సునయనపై కోర్టులో కేసు వేసి చట్టబద్ధంగానే వ్యవహారాన్ని పరిష్కరించుకుంటానని ఆయన తెగేసి చెబుతున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ 'మదన్' చిత్రానికి ఉచిత పబ్లిసిటీని తెచ్చిపెడుతోందనేది సినీ వర్గాల వ్యాఖ్య.
Be first to comment on this News / Article!
|