'ఆర్య-2'కు డబ్బింగ్ చిక్కులు!
'పరుగు' చిత్రం సక్సెస్ తర్వాత మళ్లీ ఇంతవరకూ స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ఆయన నటించిన
'ఆర్య-2' చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య' చిత్రంతో యువతను ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం కూడా మంచి అంచనాలనే రేకెత్తిస్తోంది. ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై అదిత్యబాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో ఆడియో, అక్టోబర్ మొదటి వారంలో సినిమా విడుదలకు నిర్మాతలు తొలుత సన్నాహాలు చేశారు. అయితే ఇంతవరకూ అవేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు ఈ చిత్రానికి డబ్బింగ్ చిక్కులు కూడా తలెత్తాయంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
'ఆర్య-2' చిత్రం కొంతకాలంగా లీకేజీ సమస్యలు ఎదుర్కొంటోంది. తొలుత ఈ చిత్రంలోని రెండు పాటలు వెబ్ సైట్లకు లీకయ్యాయి. కొద్దిరోజుల క్రితం లోగోతో సహా రెండు పోస్టర్లు లీక్ కావడం కూడా చర్చనీయాంశమైంది. ఫోటోలు లీకైన గంటల్లోనే డ్యామేజ్ కంట్రోల్ కోసం నిర్మాత అధికారికంగా సినిమా డిజైన్స్ మీడియాకు రిలీజ్ చేశారు. ఈ డిజైన్స్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటూ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. అయితే తనకు చెప్పకుండా డిజైన్స్ రిలీజ్ చేయడం పట్ల అల్లు అర్జున్ కినుక వహించారనీ, దీంతో డబ్బింగ్ ప్రాసెస్ కూడా జాప్యమవుతోందనీ సినీ వర్గాల భోగట్టా. మరోవైపు తనకు రావాల్సిన రెమ్యునరేషన్ బకాయిలు ఉన్నాయంటూ సుకుమార్ సైతం అలిగారట. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయని అంటున్నారు. అయితే 'మగధీర' తర్వాత మళ్లీ బాక్సాఫీస్ ను శాసించిన సినిమాలు ఏవీ రానందున 'ఆర్య 2' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇదే మంచి తరుణమని చెప్పొచ్చు. అక్టోబర్ 29న ప్రభాస్ 'ఏక్ నిరంజన్', ఆ తర్వాత క్రమంలో ఎన్టీఆర్ 'అదుర్స్' వంటి చిత్రాలు రిలీజ్ కు పోటీపడుతున్నాయి. నవంబర్, డిసెంబర్ మాసాలు ఫిల్మ్ మేకర్స్ అంతగా కలిసిరావనే ఓ అపప్రద కూడా ఉంది. ఈ క్రమంలో 'ఆర్య-2' ఇంకెత మాత్రం జాప్యం కాకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|