జెనీలియా 'కథ' 29న
'బొమ్మరిల్లు' చిత్రంలో హాసినిగా యువ ప్రేక్షకులను అలరించిన జెనీలియా ఇటీవల 'శశిరేఖా పరిణయం' చిత్రంతో మరోసారి అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉన్నప్పటికీ తెలుగులో సెలక్టివ్ గా చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె తెలుగులో ప్రేమకథాంశంతో కూడిన థ్రిలర్ చిత్రం 'కథ'లో నటిస్తోంది. అరుణ్ హీరోగా పరిచయమవుతున్నారు. జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ రాగ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతోంది.
తమ సంస్థ నుంచి వచ్చిన గత చిత్రాల తరహాలోనే వైవిధ్యమైన ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కిందని, జెనీలియా ఈ చిత్రంలో టీచర్ ప్రధాన భూమిక పోషించిందనీ గుణ్ణం గంగరాజు తెలిపారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం వినూత్న అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. ఈనెల 13న ఆడియో, 29న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫీ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనివాస్ రాగ కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్న ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజు మాటలు, రవీందర్ ఆర్ట్ , ఆండ్రూ సినిమాటోగ్రఫీ, ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|