'బెండు అప్పారావు' 16న
అల్లరి నరేష్, కామ్న జెఠ్మలాని, మేఘన హీరోహీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి.రామానాయుడు నిర్మిస్తున్న హాస్యభరిత చిత్రం 'బెండు అప్పారావు ఆర్ఎంపి'. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్న 49వ చిత్రమిది. ఈ చిత్రాన్ని ఈనెల 16న విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
తెలుగుదనం ఉట్టిపడే చిత్రమిదనీ, షడ్రుచుల సమ్మేళనంలో హాయిగా నవ్వుకునే విధంగా ఉండి అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందని రామానాయుడు తెలిపారు. అల్లరి నరేష్ చాలా చక్కగా నటించారనీ, ఇవివి కాంబినేషన్ లో తమ బ్యానర్ కు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమవుతుందనీ అన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన హాస్య చిత్రమిదని ఇవివి పేర్కొన్నారు. గ్రామీణ ప్రజల మధ్య ఉండే సరదాలు, సరసాలు, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయనీ, ఓ గ్రామంలో ఆర్ఎంపిగా ఉంటూ మందులకు లొంగని రోగాలను కూడా నవ్వుతూ మాయం చేసే చలాకీ డాక్టరే ఈ బెండప్పారావని అన్నారు. సహజమైన పాత్రలు, సన్నివేశాలు ఉన్న చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆహుతి ప్రసాద్, ధర్మవరపు, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, కొండవలస, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించారు. వెలిగొండ శ్రీనివాస్ మాటలు, వి.జయరాం సినిమాటోగ్రఫీ, కోటి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|