5న 'విలేజ్ లో వినాయకుడు'
'రొమాన్స్..కామెడీ..కొలస్ట్రాల్' అంటూ వినూత్న పబ్లిసిటీతో గత ఏడాది ప్రేక్షకులను అలరించిన 'వినాయకుడు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం 'విలేజ్ లో వినాయకుడు'. తొలి వెర్షన్ లో కథానాయకుడుగా నటించిన కృష్ణుడు ఈ సీక్వెల్ లోనూ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడిగా శరణ్య మోహన్ నటిస్తోంది. మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై సాయికిరణ్ అడవి దర్శకత్వంలో మహి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం నవంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది.
ఐడియాలో పెద్దది...బడ్జెట్ పరంగా చిన్నదిగా ఈ చిత్రం రూపొందిందనీ, క్వాలిటీ మిస్ కాకుండా కేవలం 1.38 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ ఏడాది నిర్మితమైన చిత్రాల్లోనే తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రంగా సరికొత్త రికార్డును సాధించబోతున్నామనీ నిర్మాత తెలిపారు. ఆడియో సైతం పెద్ద హిట్టయిందనీ, అతి పెద్ద సెల్లింగ్ ఆల్బమ్ క్రెడిట్ కూడా తమకే దక్కుతుందని అన్నారు. ఈ చిత్రానికి 10 మందికి పైగా మీడియా పార్టనర్స్ ఉండటం కూడా మరో విశేషంగా ఆయన చెప్పారు. చందమామ పుస్తకంలోని కథలా ఈ చిత్రం ఉంటుందనీ, ఎక్కువ భాగం రాజోలు పరిసర ప్రాంతాల్లో జరిపామనీ దర్శకుడు సాయికిరణ్ అడవి తెలిపారు. ఆడియో పెద్ద హిట్ కావడంతో సినిమాపై కూడా అంచనాలు ఎక్కువయ్యాయనీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు చక్కటి వినోదం ఖాయమనీ ఆయన చెప్పారు. యండమూరి వీరేంద్రనాథ్, రావు రమేష్, జోగినాయుడు తదితరులు ఈ చిత్రంలో నటించారు. మహి కథ, వనమాలి పాటలు, రమణ సాల్వా సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఖాద్రి సంగీతం అందించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|