డిసెంబర్ 11న 'సలీమ్'
విష్ణు, ఇలియానా నాయకానాయికలుగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, రిలయన్స్ బిగ్ సినిమా పతాకాలపై డాక్టర్ ఎం.మోహన్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'సలీమ్' (దుమ్ము రేపుతాడు). ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మోహన్ బాబు తెలిపారు.
లక్ష్మీప్రసన్న బ్యానర్ లో అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న చిత్రమిదనీ, విష్ణు కెరీర్ లోనే ఓ మరపురాని చిత్రంగా ఇది నిలుస్తుందనీ ఆయన చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన పాటలకు విశేషాదరణ లభిస్తోందనీ, హీరో నాగార్జున ఈ పాటలు బాగున్నాయంటూ ప్రత్యేకంగా ప్రశంసించారనీ చెప్పారు. ఇందులో తన పాత్ర ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేలా ఉంటుందనీ, తనపై వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేసేలా ఉంటాయనీ చెప్పారు. ఇందులో సరికొత్త విష్ణును ప్రేక్షకులు చూస్తారని దర్శకుడు వైవిఎస్ చౌదరి తెలిపారు. విష్ణు పడిన కష్టం ఇంతాఅంతా కాదనీ, పాత్ర కోసం బాడీలాంగ్వేజ్ మార్చుకోవడంతో పాటు ఎన్నో రిస్కీ షాట్స్ చేశాడనీ, ఆయన నటన, డాన్స్ లు, ఫైట్స్ అందర్నీ అబ్బురపరుస్తాయనీ తెలిపారు. ఇలియానా ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిందనీ, మోహన్ బాబు గారు ఇందులో డాన్ గా కనిపిస్తారనీ చెప్పారు. ప్రేక్షకులకు ఈ చిత్రం విందుభోజనంలా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వెంకట్, కావేరీ ఝా, గిరిబాబు, నెపోలియన్, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, తనికెళ్ల భఱణి, రఘబాబు, ముకేష్ రుషి, జీవా, బెనర్జీ తదితరులు నటించారు. చింతపల్లి రమణ మాటలు, చంద్రబోస్ పాటలు, ఆనంద్ సాయి ఆర్ట్, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|