'గాయం' మానలేదు...
పదిహేనేళ్ల క్రితం పడిన 'గాయం' ఇప్పటికీ జగపతిబాబు మరిచిపోలేదు. జగపతిబాబు కెరీర్ ను మలుపుతిప్పి, మాస్ హీరోగా ఆయనకు 'గాయం' మంచి పేరు తేవడమే ఇందుకు కారణం. జగపతిబాబు హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'గాయం' చిత్రం గురించే ఈ ముచ్చటంతా. అప్పటి వరకూ సరైన బ్రేక్ కోసం ఎదురుతెన్నులు చూసిన జగపతిబాబుకు ఆ చిత్రంలోని 'దుర్గ' పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఎన్ని హిట్లు వచ్చినా వర్మ చిత్రాన్ని మాత్రం ఆయన మరిచిపోలేదు. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఉందంటూ పలుమార్లు జగపతిబాబు చెబుతూ వచ్చారు కూడా. ఇప్పుడు ఆ ముచ్చట తీరే సమయం ఆసన్నమైంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో 'గాయం-2' చిత్రానికి ప్లానింగ్ జరుగుతోంది.
సీక్వెల్ లో కూడా జగపతిబాబు 'దుర్గ' పాత్రలోనే కనిపించబోతున్నారనీ, 15 ఏళ్ల తర్వాత దుర్గ ఎలా ఉండబోతున్నాడనే పాయింట్ ను బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుందనీ చెబుతున్నారు. తొలి వెర్షన్ లో నటించిన రేవతి, ఊర్మిళ ఇప్పుడు మలి వెర్షన్ లోనూ ఉంటారా అనేది ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతానికి అయితే ఇంకా నటీనటుల ఎంపిక మాత్రం జరగలేదు. ఇటీవల కాలంలో తెలుగులో సీక్వెల్ సంస్కృతి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రానికి కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందులోనూ ఒక హిట్ సినిమా వచ్చిన 15 ఏళ్ల తర్వాత సీక్వెల్ చేయడం అనేది గతంలో చోటుచేసుకున్న సందర్భాలు కూడా లేవు. వచ్చే ఏడాది 'గాయం-2' చిత్రం తెరపైకి రానుంది.
Be first to comment on this News / Article!
|