గోపీచంద్ సరసన ఇషానా?
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర స్ఫూర్తితో గోపీచంద్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం కథానాయిక అన్వేషణ జరుగుతోంది.తొలుత ఈ చిత్రానికి హన్సిక పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఇప్పడు ఆమెను డ్రాప్ చేశారు. 'దేశముదురు' చిత్రం ద్వారా హన్సికను పూరీ జగన్నాథ్ వెండితెరకు పరిచయం చేశారు. ఆ చిత్రం తర్వాత హన్సిక 'కంత్రి', 'మస్కా', 'బిల్లా' వంటి పలు చిత్రాల్లో బిజీ అయింది. తెలుగులో తనకు గట్టి పునాది కూడా ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో హన్సికను మరోసారి తన చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకున్న పూరీ జగన్నాథ్ అనుకున్నప్పటికీ ఆమె అడిగిన రెమ్యునరేషన్ తో ఆ ఆలోచన విరమించుకున్నారట. తాజాగా ఆయన ఉత్తరాది భామలకు బదులు దేశీగాళ్ ఇషానాను ఎంపిక చేశారనీ సమాచారం.
క్రియేటివ్ డైరెక్టర్ తేజ 'కేక' చిత్రం ద్వారా కరీంనగర్ కు చెందిన ఇషానాను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఆ చిత్రంలో ఇషానా గ్లామర్ కు మంచిపేరే వచ్చినా సినిమా ఫెయిల్ కావడంతో ఆమెకు మరో అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో పూరీ పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించి చివరకు ఇషానాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గోపీచంద్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తుండటంతో పాటు ఆయన పాత్రలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది. నాజర్, రోజా ఇంతవరకూ ఎంపికైన తారాగణం. ఈనెల మూడోవారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు రానుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, చక్రి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|