'లీడర్' స్టోరీపై పేచీ?
క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న శేఖర్ కమ్ముల ఏ సినిమాలు తీసినా తన 'బ్రైన్ చైల్డ్' గా చెప్పుకుంటారు. 'ఆనంద్', 'హ్యాపీడేస్' చిత్రాలను ఎంతో మురిపింగా చెప్పుకునే శేఖర్ కమ్ముల తన తాజా చిత్రం 'లీడర్'ను తన తల్లిలాంటి చిత్రంగా చెప్పుకొచ్చారు. డాక్టర్ డి.రామానాయుడు మనువడు రానాను హీరోగా పరిచయం చేస్తూ ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ పై శేఖర్ కమ్ముల రూపొందించిన 'లీడర్' ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇంతవరకూ ప్రేమకథా ఇతివృత్తాలనే ఎంచుకుంటూ వచ్చిన కమ్ముల తొలిసారి రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవతున్న తరుణంలో ఓ కొత్త చిక్కు వచ్చిపడినట్టు విశ్వసనీయ సినీ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ కథ సరిగ్గా తాను రాసుకున్న'లీడర్' అనే కథలోంచి తీసుకున్నదేననీ, తనకు నష్టపరిహారం కావాలనీ శివ అనే వ్యక్తి రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది తాను రాసుకున్న సొంత కథ అనీ, కాపీ కొట్టే అవసరం తనకు లేదనీ శేఖర్ కమ్ముల తేల్చిచెప్పారని అంటున్నారు. కథా చౌర్యానికి గాను 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని అసోసియేషన్ వద్ద శివ పట్టుబట్టినట్టు చెబుతున్నారు. శేఖర్ కమ్ముల మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారట. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా చేర్చుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ సమస్య తలెత్తడం ఫిల్మ్ మేకర్స్ కు ఎంతో కొంత ఇబ్బంది కలిగించే అంశమేనని చెబుతున్నారు. అసలే రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో కొత్త సినిమాలు ఏటికి ఎదురీదుతున్న తరుణంలో తాజా అవాంతరాన్ని 'లీడర్' అధిగమించి సకాలంలో జనం ముందుకు వస్తాడనే అనుకుందాం.
Be first to comment on this News / Article!
|