13న 'సీతారాముల కళ్యాణం'
నితిన్, హన్సిక జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ మళ్ల విజయప్రసాద్ నిర్మిస్తున్న 'సీతారాముల కల్యాణం లంకలో' చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈనెల 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. విశాఖలో ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఆడియో సక్సెస్ మీట్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం రాత్రి నిర్వహించారు. నితిన్, హన్సిక, చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, మళ్ల విజయప్రసాద్, కె.ఎస్.రామారావు, సుధాకర్ రెడ్డి, సుబ్బరాజు పాల్గొన్నారు.
నితిన్ మాట్లాడుతూ, అనూప్ రూబెన్స్ గతంలో తాను నటించిన 'ధైర్యం', 'ద్రోణ' చిత్రాలకు అందించిన సంగీతం మంచి ఆదరణ చూరగొందనీ, ఈ రెండు చిత్రాలకు మించి ఈ సినిమా ఆడియో చాలా పెద్ద సక్సెస్ అయిందనీ అన్నారు. ఈ సినిమాలో తాను రాముడు అయితే, హన్సిక సీత అనీ, హనుమంతుడు బ్రహ్మానందం అనీ, స్టోరీలైన్ పాతదే అయినా దర్శకుడు తీసిన విధానం చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా ఆడియోకు చాలా మంచి రెస్పాన్ వచ్చిందని అనూప్ రూబెన్స్ పేర్కొన్నారు. ముఖ్యంగా దలేర్ మెహందీ పాడిన పాటకు చాలా చక్కటి స్పందన లభిస్తోందన్నారు. సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుందని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. మంచి ఎనర్జీ ఉన్న నటుడు నితిన్ అనీ, కథ మీద నమ్మకంతో దర్శకనిర్మాతలు తీసిన ఈ చిత్రం తప్పనిసరిగా సంక్రాంతికి మంచి సినిమా అవుతుందనీ కె.ఎస్.రామారావు అన్నారు. ఆడియో పెద్ద హిట్ అయిందనీ, సినిమా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాననీ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ, కథను అనుకున్నప్పుడు నితిన్ అయితేనే బాగుంటుందని అనిపించి ఆయనను ఎన్నుకున్నామనీ, ఆయనతో పాటు ప్రతి ఒక్కరూ కమిట్ మెంట్ తో పనిచేశారనీ అన్నారు. సంక్రాంతి కానుకగా 13న రిలీజ్ ఉంటుందని చెప్పారు.

Be first to comment on this News / Article!
|