7 పాత్రల్లో ఎన్టీఆర్?
యువహీరోల్లో చిచ్చరపిడుగు అనిపించుకుంటున్న ఎన్టీఆర్, దర్శక సంచలనంగా పేరున్న వి.వి.వినాయక్ కలిస్తే ఆ ఇద్దరి కాంబినేషన్ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు హద్దులు దాటుతాయి. 'ఆది' చిత్రంతో ఇటు ఎన్టీఆర్ కూ, అటు వినాయక్ కూ దాదాపు ఒకేసారి స్టార్ స్టాటస్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఇద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ గా రూపొందిన 'అదుర్స్' చిత్రం ఇప్పుడు సంక్రాంతి రికార్డులపై కన్నేసి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత కూడా మరోసారి ఈ కాంబినేషన్ పునరావృతం కాబోతోంది. ఇది ఎన్టీఆర్ కు వినాయక్ ఇచ్చే స్పెషల్ ప్యాకేజీగా ఉండబోతోంది. సెకెండ్ హ్యాట్రిక్ కు శుభారంభం కానున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే వినాయక్ ఓ స్పెషల్ సబ్జెక్ట్ రెడీ చేసినట్టు సమాచారం.
వినాయక్ చెప్పిన స్టోరీలైన్ ఎన్టీఆర్ ముగ్దుడై వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ స్టోరీలైన్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎన్టీఆర్ 7 పాత్రలు పోషించనుండటం. ఇంతవరకూ ద్విపాత్రాభినయం మాత్రమే చేసిన ఎన్టీఆర్ ఒకే చిత్రంలో ఏడు పాత్రలు చేయడమంటే స్క్రీన్ నుండా ఎన్టీఆర్ విశ్వరూపాన్ని ఆవిష్కరించడమే అవుతుంది. ఇది ఒక రకంగా తన తాతగారైన నటరత్న ఎన్టీఆర్ నటించిన ఒకే చిత్రంలో ఐదు పాత్రల రికార్డును కూడా బ్రేక్ చేయడమే అవుతుంది. ఈ చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకునే అవకాశాలూ ఉన్నాయి. ఈ చిత్రానికి 'సెవన్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|