సంక్రాంతి గిఫ్ట్ 'నమో వెంకటేశ'
సంక్రాంతి సీజన్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం 'నమో వెంకటేశ' అని ఆ చిత్ర కథానాయకుడు వెంకటేష్ తెలిపారు. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో వెంకటేష్ ఈ చిత్ర విశేషాలను, సినిమాపై ఉన్న అంచనాలను. హైలైట్స్ ను తెలియజేశారు.
సంక్రాంతి సీజన్ అంటేనే ఇంటిల్లిపాదీ సినిమాలు చూసేందుకు మక్కువ చూపుతారనీ, అలాంటి సీజన్ కు సంబంధించి చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదనీ, సూటిగా చెప్పాలంటే క్లీన్ మూవీ అనీ అన్నారు. 'మనం సాధారణంగా చాలా సందర్బాల్లో ఆవేశంతో ప్రవర్తిస్తాం. ఇతరులను విమర్శిస్తాం. అయితే పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందనేది ఇందులోని నా పాత్ర స్వభావం. లవబుల్ క్యారెక్టర్. పెళ్లి చేసుకునేందుకు ఓ మంచి కోసం ఎంతోకాలంగా ఎదురుచూసే పాత్ర నాది. పెళ్లికాని ప్రసాద్ ను మించిన రేంజ్ లో ఉంటుంది. నా పాత్రలో కావాల్సినంత కామెడీ ఉంటుంది. దానిని శ్రీనువైట్ల తెరకెక్కించిన విధానం సుపర్బ్. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రం తర్వాత త్రిష కాంబినేషన్ లో నేను చేసిన చిత్రమిది. బ్రహ్మానందం పాత్ర ఎంతగానో అలరిస్తుంది. మా ఇద్దరి మధ్యా కామెడీ టైమింగ్ బాగా కుదిరింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. పాటలన్నీ పెద్ద హిట్టయ్యాయి. సౌందర్య సౌందర్య....వెంకటేశ నమో నమే...వంటి పాటలు ఇప్పటికే అదరగొట్టేస్తున్నాయి. ఆ పాటలన్నీ యూరప్, ఐస్ లాండ్ వంటి కొత్త కొత్త లొకేషన్లకు వెళ్లి ఎంతో కష్టపడి చేశాం. యూనిట్ పడిన కష్టాన్ని మెచ్చి ప్రేక్షకులు ఘన విజయం అందిస్తారనే నమ్మకం ఉంది. సంక్రాంతి విషెస్ టు మూవీ లవర్స్' అంటూ వెంకటేష్ చిరునవ్వులు చిందించారు.
Be first to comment on this News / Article!
|