'సీతారాముల కళ్యాణం' 22న
ఈనెల 22న రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో 'సీతారాముల కళ్యాణం' జరగబోతోందని నిర్మాత మళ్ల విజయప్రసాద్ ప్రకటించారు. నితిన్, హన్సిక జంటగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రమే 'సీతారాముల కళ్యాణం.' దీనికి 'లంకలో' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈశ్వరరెడ్డి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మంచి సక్సెస్ కావడంతో సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
టైటిల్ కు తగ్గట్టే కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమిదనీ, కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించామనీ మళ్ల విజయప్రసాద్ తెలిపారు. నితిన్ కు ఈ చిత్రం ద్వారా మళ్లీ పూర్వ వైభవం వస్తుందనీ, హన్సిక గ్లామర్ కూడా ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందనీ తెలిపారు. ఈ చిత్రానికి సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ లభించిందనీ, సినిమా చూసిన సెన్సార్ సభ్యులు బాగుందని ఎంతో అభినందించారని తెలిపారు. ఆడియో మంచి విజయం సాధించడంతో సినిమా విజయంపై నమ్మకం రెట్టింపయిందని పేర్కొన్నారు. ఈనెల 22న సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కథాంశం పాతదే అయినా దర్శకుడు కొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు నితిన్ తెలిపారు. ఇందులో రాముడు తరహా పాత్రలో తాను, సీతగా హన్సిక, హనుమంతుడి పాత్రలో బ్రహ్మానందం నటించినట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, సుబ్బరాజు తదితరులు నటించారు. తోట ప్రసాద్ మాటలు, ఎం.జోషి సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|