నటన నా ఊపిరి: కృష్ణంరాజు
సినిమా, రాజకీయ రంగం తనకు రెండు కళ్లులాంటివనీ, వాటికి దూరంగా ఉండే ప్రసక్తే లేదని రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలిపారు. నటుడిగా బయట చిత్రాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవనీ, మంచి పాత్రలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాననీ ఆయన పేర్కొన్నారు. బుధవారంనాడు కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా హైద్రాబాద్ లోని తన నివాసంలో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.
నటుడుగా...నిర్మాతగా
గోపీకృష్ణ మూవీస్ బేనర్ పై 'మనవూరి పాండవులు', 'అమర దీపం', 'భక్తకన్నప్ప', 'కృష్ణవేణి' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశాం. 18 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ తో 'బిల్లా' తీశాం. ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. తెలుగులో హాలీవుడ్ స్థాయి చిత్రం తీశారంటూ అందరూ ప్రశంసించారు. కొత్త సినిమాలు చేయడానికి ప్రస్తుతం కథలు వింటున్నాను. మంచి పాత్రలు దొరికితే బయట నిర్మాతల చిత్రాలకూ పనిచేస్తాను.
దర్శకత్వం చేపడతా...
నటుడుగా, నిర్మాతగా ఉన్న అపార అనుభవంతో ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకుంటున్నాను. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మరోసారి ఆ వివరాలు చెబుతాను.
రాజకీయాల్లో గ్యాప్ తాత్కాలికమే...
నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడుగా మూడు రంగాల్లోనూ ఎనలేని సంతృప్తి లభించింది. నటుడిగా ఎన్నో చక్కటి పాత్రలు పోషించాను. నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు తీసిన తృప్తి ఉంది. రాజకీయ నాయకుడుగా కాకినాడకు 15 మాసాలు ప్రాతినిధ్యం వహించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. పార్టీ అదేశంతోనే నరసాపురం నుంచి పోటీ చేశాను. ఇండియాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపెందిన మూడవ వ్యక్తిగా నాకు ఆధిక్యం లభించింది. అక్కడ కూడా 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికే మళ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం కొంత బాధ కలిగించింది. ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను. అంతమాత్రాన రాజకీయాలు వదిలినట్టు కాదు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నాను. మునుముందు రాజకీయాల్లోకి వచ్చి బిజీ అయినా సినిమా రంగాన్ని మాత్రం వదిలిపెట్టాను...అంటూ నవ్వుతూ చెప్పారు రెబల్ స్టార్.
Be first to comment on this News / Article!
|