వికె మూర్తికి 'ఫాల్కే'
బెంగుళురు: ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మకమైన దాదా ఫాల్కే అవార్డు ఒక సినిమాటోగ్రాఫర్ కు దక్కడం ఇదే తొలిసారి. ప్లేబ్యాక్ లెజెంట్ మన్నా డే తరువాత ఈ అవార్డుకు ఎంపికైన రెండవ కన్నడిగ ఆయన కావడం విశేషం. గురుదత్ సినిమాలన్నింటికీ మూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అలాగే ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకులు శ్యాం బెనెగల్ లాంటి ఇతర దర్శకుల వద్ద కూడా మూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ప్యాసా, సాహెబ్ బీబీ ఔర్ గులాం, పాకీజా, సిఐడి, రజియా సుల్తానా తదితర చిత్రాలకు వికె మూర్తి కెమెరామన్ గా పనిచేశారు. మన దేశంలో నిర్మించిన తొలి 70 ఎంఎం చిత్రం 'కాగజ్ కే పూల్' చిత్రానికి మూర్తి కెమెరామన్ గా పనిచేశారు.
మైసూరులో 1923లో జన్మించిన మూర్తి బెంగుళూరులోని ఎస్.జె.పాలిటెక్నిక్ కాలేజీ తొలి బ్యాచ్ (1943-46) విద్యార్థిగా సినిమాటోగ్రఫీలో డిప్లొమా తీసుకున్నారు. 1959, 60 సంవత్సరాల్లో వి.కె. మూర్తి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డులు అందుకున్నారు. కలర్ సినిమాటోగ్రఫీ ఆద్యులలో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వయోలనిస్టుగా తన సినిమా కెరీర్ ను ఆయన ప్రారంభించడం మరో విశేషం. 87 ఏళ్ల మూర్తి ప్రతిభకు గుర్తింపుగా 2005లో జీవన సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్ మెంట్) కూడా పొందారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మూర్తి త్వరలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డు కింద 10 లక్షల నగదు, స్వర్ణకమలం అందజేస్తారు.
Be first to comment on this News / Article!
|