5న వస్తున్న 'బిందాస్'
ఒక లక్ష్యం లేకుండా ఆడుతూపాడుతూ తిరిగే ఓ యువకుడి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనే కథాంశంతో రూపొందిన చిత్రం 'బిందాస్'. దీనికి 'అజయ్ గాడి విజయగాథ' అనే ట్యాగ్ లైన్ ఉంది. మంచు మనోజ్, షీనా (నూతన పరిచయం) జంటగా నటించారు. రచయిత వీరు పోట్ల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎ టీవీ సమర్పణలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకొంటోంది. కాగా...ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు.
ఈ చిత్రకథ ఏమిటనేది 'అజయ్ గాడి విజయగాథ' అనే ట్యాగ్ లైన్ చెప్పకనే చెబుతోందనీ, మనోజ్ డూప్ లేకుండా చేసిన క్లైమాక్స్ ఫైట్ ఈ చిత్రానికి ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ ఆయన తెలిపారు. ఇందులో 35 మంది తారాగణం నటించినట్టు చెప్పారు. వీరుపోట్ల మాట్లాడుతూ, సహజంగా మనల్ని ఇష్టపడిన వాళ్లను మాత్రమే మనం కూడా ఇష్టపడుతుంటామనీ, అయితే తనను ఇష్టపడని వాళ్లను కూడా ఇష్టపడటమే ఇందులో హీరో ప్రత్యేకతనీ అన్నారు. సరికొత్త మనోజ్ ను ఇందులో చూస్తారని చెప్పారు. ఇప్పటికే బోబో శశి అందించిన పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకుంటున్నాయనీ, వాటి చిత్రీకరణ కూడా చాలా బాగుటుందనీ చెప్పారు. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రమిదని పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి, డాక్టర్ బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆహుతి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, సుబ్బరాజు, మాస్టర్ భరత్ తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం వీరు పోట్ల అందించిన ఈ చిత్రానికి రమేష్ బాబు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|